నిండుకున్న మందులు | - | Sakshi
Sakshi News home page

నిండుకున్న మందులు

Apr 27 2026 8:24 AM | Updated on Apr 27 2026 8:24 AM

నిండుకున్న మందులు

విజయనగరం ఫోర్ట్‌: మెరకముడిదాం మండలానికి చెందిన ఓ ఫైలేరియా రోగి విజయనగరంలోని ఫైలేరియా యూనిట్‌కు వెళ్లి వ్యాధి నివారణకు ఉపయోగించే డీఈసీ మాత్రలు అడగ్గా మందులు లేవనిచెప్పి పంపించేశారు.

● గంట్యాడ మండలానికి చెందిన ఓరోగి కూడా విజయనగరంలో ఉన్న ఫైలేరియా యూనిట్‌కు డీఈసీ మాత్రల కోసం వెళ్లగా అక్కడి సిబ్బంది మందులు లేవని చెప్పి పంపించేశారు. ఇలా వీరిద్దరే ఫైలేరియా వ్యాధితో బాధపడుతున్న అనేక మంది రోగులకు ఎదురువుతున్న పరిస్థితి ఇది. ఫైలేరియా (బోద) వ్యాధి నివారణలో డీఈసీ మాత్రలు బాగా పనిచేస్తాయి. వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. దీంతో వ్యాధిగ్రస్తులు ఈ మాత్రలు వేసుకోవడానికి అసక్తి చూపుతారు. వేలాది మంది బోదవ్యాధిగ్రస్తులు జిల్లాలో ఉన్నారు. బోధవ్యాధిగ్రస్తుల పట్ల సమాజంలో వివక్ష ఉంది. బోధవ్యాధి సోకినవారిలో చాలా మంది అవివాహితులుగా ఉండిపోతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే రోగులు మరింత ఇబ్బంది పడతారు. ఈ వ్యాధిగ్రస్తులకు చిన్న రాయి గుచ్చుకున్నా పెద్దపెద్ద గాయాలై పోతాయి. అంతేకాకుండా సెల్యూలైటిస్‌ వ్యాధి త్వరగా వీరికి సోకుతుంది. దీంతో వారు మందులు వాడుతూ అత్యంత అప్రమత్తంగా ఉండాలి.

జిల్లాలో 3,238 మంది రోగులు

జిల్లాలో 3,238 మంది ఫైలేరియా వ్యాధిగ్రస్తులు ఉన్నారు. గుర్ల, బలిజిపేట మండలాల్లో ఎక్కువగా ఈ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఈ వ్యాధిసోకడం వల్ల వారంతా నిత్యం ఇబ్బంది పడుతూ ఉంటారు.

మందుల సరఫరా నిలిపివేసిన సర్కార్‌

ఫైలేరియా వ్యాధిగ్రస్తులకు అందించే డీఈసీ మాత్రల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం వ్యాధితో బాధపడుతున్నవారికి డీఈసీ మాత్రలు అందడం లేదు. మందులు అవసరమైన రోగులు ప్రైవేట్‌ మందుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. ఉచితంగా అందాల్సిన మందులకు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైలేరియా రోగులు జ్వరం, కాలువాపు, ఇన్‌ఫెక్షన్స్‌కు గురవుతారు. అటువంటప్పుడు డీఈసీ మాత్రలు వాడితే అవి తగ్గుతాయి.

క్యూలెక్స్‌ దోమ కుట్టడంతో వ్యాధి వ్యాప్తి

క్యూలెక్స్‌ అనే దోమ కుట్టడం వల్ల బోద వ్యాధి వ్యాప్తి చెందుతుంది. బోధవ్యాధి అంతత్వరగా బయట పడదు. వ్యాధి బయట పడడానికి 10, 15 ఏళ్లు పడుతుంది. కొద్దిపాటి జ్వరానికి తరచూ గురవుతారు. చంకల్లో, గజ్జల్లో బిళ్ల కట్టడం, కాళ్లు చేతులపై ఎర్రని చారలు కనబడతాయి. కొంత కాలం తార్వాత కాళ్లు, చేతులు, వృషణాలు , ఇతర జన నేంద్రియములకు సంబంధించిన వాపులు కూడా బోద వ్యాధి లక్షణాలే. బోధ వ్యాధిసోకిన వ్యక్తికి 21 రోజుల పాటు తొలుత చికిత్స అందిస్తారు. ఆ తర్వాత ప్రతి మూడు నెలలకు ఒకసారి 12 రోజుల పాటు మందులు వాడాల్సి ఉంటుంది.

ఫైలేరియాకు మందుల సరఫరా

నిలిపివేసిన ప్రభుత్వం

జిల్లాలో 3,238 మంది వరకు

ఫైలేరియా వ్యాధిగ్రస్తులు

ప్రైవేటుగా మందులు కొనుగోలు చేస్తున్న రోగులు

కొత్త కేసులకు మాత్రమే !

ప్రస్తుతం వ్యాధిబారిన వారికి మందుల సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. సంబంధిత పీహెచ్‌సీలకు వెళితే వారికి డీఈసీ మాత్రలు ఇస్తారు. కొత్తగా నమోదైన కేసులకు మాత్రమే మందులు ఇస్తున్నాం.

ఎం.సింహాచలం,

జిల్లా మలేరియా నివారణ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement