నెల్లిమర్ల రూరల్: మండలంలో వరుస చోరీలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆలయాలు, ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల రామతీర్థం పంచాయతీ దేవుని నెలివాడలో ఉన్న అమ్మవారి ఆలయంలో తాళాలు విరగ్గొట్టి హుండీలోని డబ్బులతో పాటు అమ్మవారి బంగారు ఆభరణాలను ఎత్తుకువెళ్లారు. ఆ ఘటన మరువక ముందే శనివారం అర్ధరాత్రి గొర్లిపేట జగనన్న కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనాన్ని దొంగిలించుకుపోయారు. గతంలో కూడా నెల్లిమర్ల–రణస్థలం రహదారిలో బైక్ చోరీలు ఎన్నో జరిగాయి. రాత్రి వేళ రహదారి మొత్తం నిర్మానుష్యంగా ఉండడం..జాతీయ రహదారికి అత్యంత దగ్గరగా ఉండడంతో ఈ రహదారిని చోరీలకు అనుకూలంగా మార్చుకుంటున్నారని ప్రజలు చెబుతున్నారు. పోలీసులు స్పందించి రాత్రి వేళల్లో నిఘా పెంచాలని కోరుతున్నారు.


