చీపురుపల్లి: గరివిడి మండలంలోని అర్తమూరు గ్రామంలో వెలసిన గ్రామదేవత శ్యామలాంబకు ఏటా నిర్వహించే పాలస్నానం మంగళవారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మమారికి సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో గ్రామస్తులు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పాలస్నానం చేయనున్నారు. పాలస్నానం సందర్భంగా రాత్రి సాంస్కృతిక కార్యమాలు ఏర్పాటు చేసినట్లు ఆలయ అభివృద్ధి ధర్మకర్త(ఆశాది) పొన్నాడ సూర్యనారాయణ, గ్రామ ప్రజలు తెలియజేశారు.
గ్రావెల్ తరలిస్తున్న లారీ, జేసీబీ అడ్డగింత
బొండపల్లి: మండలంలోని కనిమెరక గ్రామ పంచాయతీ పరిధిలో గల మంగలి చెరువులో అక్రమంగా గ్రావెల్ తవ్వి తరలిస్తున్న జేసీబీతో పాటు, లారీని పట్టుకుని తహసీల్దార్ కార్యాలయానికి తరలించినట్లు తహసీల్దార్ డోలా రాజేశ్వర్రావు తెలిపారు. వాల్టా చట్టం నిబంధనలు ఉల్లఘించి గ్రావెల్‌ను చెరువు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ మేరకు రూ.15 వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ హరిప్రసాద్ వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్
సెంటర్‌లో ప్రవేశాల ప్రారంభం
చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడిలో గల ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్‌లో చెవిటి,మూగ,దృష్టి లోపం ఉన్న చిన్నారులకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని వెల్ఫేర్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్ జీవీఎన్.రామకృష్ణ తెలిపారు. 6 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఉచిత విద్యతో పాటు ఉచిత వసతి,ఉచిత భోజనం, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగ చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి గల వారు ఫోన్ 9494777905 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆకస్మికంగా ఉపాధ్యాయుడి మృతి
వేపాడ: మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు కాపు సత్యనారాయణ (40) ఆదివారం ఆకస్మికంగా మృతిచెందారు. ఇందుకు సంబంధించి స్దానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో జరిగిన ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయనకు ఆకస్మికంగా ఆరోగ్యం బాగోకపోవడంతో ఎస్‌కోటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కాపు సత్యనారాయణ ప్రస్తుతం మెంటాడ మండలం బిరసాడవలస ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య జయ ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉపాధ్యాయుడి మృతిపట్ల వేపాడ మండల ఉపాధ్యాయులు దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.


