విజయనగరం అర్బన్: వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ నిర్వహించిన అంతర్జాతీయ వీడియో పోటీలో విశాఖపట్నానికి చెందిన డా. నీలిమ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ను అందుకున్నారు. వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే సందర్భంగా స్థానిక సీతం కళాశాలలో ఆదివారం ఆమెను ప్రత్యేకంగా సన్మానించారు. ‘ఐపీ అండ్ స్పోర్ట్స్’ అనే థీమ్‌పై డా. నీలిమ రూపొందించిన ‘కలరిపయట్టు’ వీడియో విశేష ప్రజాదరణ పొందింది. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల నుంచి వచ్చిన 182 వీడియోల్లో ఆమె వీడియో టాప్–20లో స్థానం సంపాదించడం విశేషం. భారతదేశం నుంచి ఎంపికై న ఏకై క ప్రతినిధిగా ఆమె నిలిచారు. ఏప్రిల్ 6 నుంచి 19 వరకు నిర్వహించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో అత్యధిక మద్దతు సాధించి డా.నీలిమ ‘పీపుల్స్ చాయిస్ అవార్డు’ను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, సత్య విద్యా సంస్థల సెక్రటరీ–కరెస్పాండెంట్ డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి మాట్లాడుతూ, డా. నీలిమ సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో సత్య విద్యా సంస్థల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణ్ రావు పాల్గొన్నారు.
అభినందించిన మాజీ ఎంపీ డా. బొత్స ఝాన్సీ


