కురుపాం/గుమ్మలక్ష్మీపురం: నిద్రలో ఉన్న మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. గుమ్మలక్ష్మీపురం గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. స్థానిక సంత వీధిలో శనివారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఓ ఇంటి వరండాలో మహిళ నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా ఆమె మెడలోని సుమారు రెండు తులాల బంగారు గొలుసును బలవంతంగా లాక్కుని పరారయ్యారు. బాధితురాలు తేరుకుని కేకలు వేసేలోపే నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నేరస్థలం వద్ద లభించిన ఆధారాల ప్రకారం ఒక అనుమానిత వ్యక్తి ఛాయాచిత్రాన్ని సేకరించారు. చిత్రంలో ఉన్న వ్యక్తి వివరాలు గానీ, ఈ నేరానికి సంబంధించిన సమాచారం గానీ తెలిసిన వారు వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించదలచిన వారు ఎల్విన్ పేట సర్కిల్ ఇన్‌న్‌స్పెక్టర్ 92487 01917, ఎల్విన్ పేట సబ్ ఇన్‌స్పెక్టర్ 7981296171 లేదా నీలకంఠాపురం సబ్ ఇన్‌న్‌స్పెక్టర్ 6281897578 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందజేయనున్నామని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు యంత్రాంగం వెల్లడించింది.


