ఇల్లే.. క్రీడా లోకం... | - | Sakshi
Sakshi News home page

ఇల్లే.. క్రీడా లోకం...

Apr 26 2026 5:15 AM | Updated on Apr 26 2026 5:15 AM

ఇల్లే.. క్రీడా లోకం...

అనుబంధం.. ఆప్యాయత..

ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేసేందుకు వివిధ రకాల ఆట వస్తువులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. తక్కువ ఖర్చులో ఇంట్లోనే కొన్ని రకాల ఆటలను రూపొందించుకోవచ్చు. పాత తరం నుంచి వచ్చే వాటిని అమ్మమ్మ, నానమ్మ, తాతల నుంచి నేర్చుకోవచ్చు. ఇదే క్రమంలో పిల్లల ముందు అవసరానికి మించి ఫోన్‌ వినియోగించడం ద్వారా వారి మనసు మళ్లే అవకాశం ఉందని గుర్తించాలి. వారితో పాటు కొన్ని రకాల వాటిల్లో భాగస్వాములైతే.. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరగనుంది. అందుకు రోజులో కొంత సమయాన్ని తప్పక కేటాయించాలని మానసిక నిపుణులు సైతం చెబుతున్నారు. ఇదే క్రమంలో ఆటల ద్వారా గెలుపోటములు సమానంగా స్వీకరించే సామర్థ్యం సొంతమవుతుంది.

బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, క్రికెట్‌

ఇంటి ఆవరణలో కాస్త ఖాళీ స్థలం ఉంటే.. బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌, క్రికెట్‌(మినీ సెట్‌) ఆడుకోవచ్చు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఒక్కో సెట్‌ రూ.500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. ఇద్దరు లేదా నలుగురు ఒకేసారి రంగంలో దిగొచ్చు. వాటి ద్వారా దూరదృష్టి, మెదడు చురుకుదనం పెరుగుతుంది. కండరాలను బలంగా మార్చుతుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.. రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

బిజినెస్‌, లూడో

రూ.100 – రూ.300 వరకు ధర పలుకుతున్నాయి. బిజినెస్‌ గేమ్‌లో నలుగురు ఆడవచ్చు. పాచికలతో కూడిన ఆట. వ్యాపార మెలకువలు తెలుస్తాయి. లూడో గేమ్‌తో కుటుంబం, స్నేహితుల మధ్య అనుబంధం పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. పిల్లల్లో లెక్కలు, సంఖ్యల గుర్తింపు సామర్థ్యం పెంచుతాయి.

వైకుంఠపాళి, అష్టాచెమ్మ..

ఒక్కో క్రీడా సెట్‌ రూ.300 వరకు పలుకుతుంది. వైకుంఠపాళి, అష్టాచెమ్మ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. గెలుపోటములు, హెచ్చుతగ్గులను ఈ ఆటలు బోధిస్తాయి. మెదడుకు చక్కటి వ్యాయామం లభిస్తుంది. వ్యూహాలు నేర్చుకోవచ్చు. రోజంతా వినోదాన్ని పంచుతాయి.

చదరంగం..

చెస్‌ బోర్డు రూ.200 నుంచి రూ.300ల లోపే లభిస్తుంది. ఇద్దరు సరదాగా ఆడుకోవచ్చు. మెదడుకు పదును పెట్టే చురుకై న ఆట. మేధో, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. ప్రత్యర్థులకు అందకుండా వ్యూహాలు రచించడం, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలు పెంపొందుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement