మక్కువ: మక్కువ ప్రధాన రహదారి విస్తరణ పనులకు ఆటంకం కలిగించిన వారిని అరెస్టు చేయాలని మంత్రి సంధ్యారాణి పోలీసులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాదర్బార్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మక్కువ ప్రధాన రహదారి విస్తరణ పనులను ఎవరు అడ్డుకున్నా... రోడ్డు విస్తరణ పనులకు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చినా అరెస్డు చేయాలని సాలూరు సీఐ రామకృష్ణను ఆదేశించారు. రహదారిపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసేయాలన్నారు.
సొంత పార్టీ నుంచే ఫిర్యాదులు
ప్రజాదర్బార్ కార్యక్రమంలో ఆ పార్టీ నుంచే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. మక్కువ మండలానికి చెందిన అధికార పార్టీ నాయకులే ఎక్కువ మంది కనిపించారు. వీరిలో చాలా మంది రోడ్లు, భూ సమస్యలపై, పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ మంత్రికి వినతిపత్రాలు అందజేశారు.
మంత్రి మాటలకు ఉపాధి వేతనదారులు షాక్
ఉచిత బస్సులో ఉపాధి వేతనదారులు పని ప్రదేశం నుంచి ఆర్టీసీ బస్సులో శనివారం మక్కువ ప్రధాన రహదారి వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో మంత్రి సంధ్యారాణి వేతనదారులతో మాట్లాడుతుండగా ఉపాధి బిల్లులు అందడం లేదని వేతనదారులు సమస్యని తీసుకువచ్చారు. దీంతో మంత్రి మాట్లాడుతూ ఉపాధి బకాయిలు బ్యాంకులో ఉంటే.. మీ వద్ద ఉన్నట్టే అంటూ మాట్లాడటంతో వేతనదారులు షాకయ్యారు. ఎంపీడీఓ అర్జునరావు, తహసీల్దార్ కె.భరత్‌కుమార్‌తో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
మంత్రి సంధ్యారాణి


