వడదెబ్బకు వస్త్ర వ్యాపారి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బకు వస్త్ర వ్యాపారి మృతి

Apr 26 2026 5:15 AM | Updated on Apr 26 2026 5:15 AM

వడదెబ్బకు వస్త్ర వ్యాపారి మృతి అనారోగ్యంతో గిరిజన విద్యార్థి..

రాజాం సిటీ: కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని నిశ్చయించుకున్నాడు ఆ యువకుడు. తన తండ్రి శ్రీనివాసరావు చేస్తున్న బట్టల వ్యాపారాన్నే వృత్తిగా ఎంచుకుని కొంతకాలం తండ్రితో వ్యాపారం చేస్తూ మెలకువలు నేర్చుకున్నాడు. తరువాత వేరుగా వ్యాపారం చేయడం మొదలు పెట్టి కుటుంబానికి పెద్దదిక్కుగా మారాడు. వ్యాపారంలో నిమగ్నమైన ఆ యువకుడిని వడదెబ్బ రూపంలో మృత్యువు కబళిస్తుందని తెలుసుకోలేకపోయాడు. మండల పరిధి దోసరి గ్రామానికి చెందిన కత్తిరి బాబి (23) వడదెబ్బకు గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన కత్తిరి బాబి వస్త్ర వ్యాపారం చేస్తూ ఇతర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నాడు. గుమ్మలక్ష్మీపురంలో నివాసం ఉన్న బాబి ఎప్పటిలాగే ఈ నెల 24న కూడా వ్యాపారానికి వెళ్లాడు. తిరిగి ఇంటికి చేరుకున్న తరువాత ఎండ తీవ్రతతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే స్థానికులు గమనించి కురుపాం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా తను కష్టపడుతూ తన అన్నయ్య అభిని డిగ్రీ చదివించడంతో పాటు ఉద్యోగం సాధించేందుకు అవసరమయ్యే కోచింగ్‌కు అయ్యే ఖర్చు భరిస్తున్నాడని గ్రామస్తులు తెలిపారు. తాను ఎలాగూ చదువుకోలేకపోయానని, తన అన్నయ్యను అయినా మంచి ఉద్యోగిగా చూడాలని ఆశపడేవాడని పేర్కొన్నారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న బాబి మృతితో తల్లిదండ్రులు కత్తిరి శ్రీనివాసరావు, మల్లీశ్వరితో పాటు కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. వడదెబ్బ కారణంగానే బాబి మృతి చెందాడని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కురుపాం : మండలంలోని మర్రిమానుగూడ గ్రామానికి చెందిన బిడ్డిక రాహుల్‌(9) అనారోగ్యంతో శనివారం సొంతూరులోనే మృతి చెందాడు. రాహుల్‌ నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్నాడని, పాఠశాలలో ఉండగానే అనారోగ్యంతో బాధపడేవాడని, సంబంధిత సిబ్బంది పట్టించుకోలేదని.. పాఠశాల ఉన్న సమయంలో తమ వెంట పంపించాలని కోరినా పంపలేదని రాహుల్‌ తల్లి శాంతి కన్నీరుమున్నీరైంది. రాహుల్‌ కుటుంబానికి పది లక్షలు రూపాయిలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బిడ్డిక అనిల్‌ డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విద్యార్థి గ్రామానికి వెళ్లి మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. రాహుల్‌ మృతికి పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

దోసరిలో విషాదం

Advertisement
 
Advertisement
Advertisement