జియ్యమ్మవలస రూరల్: మండలంలో గజరాజుల సంచారంతో ఏడాది పొడవునా పంటలు నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం సింగనాపురం గ్రామ సమీపాన పంట పొలాల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి. వ్యవసాయం, బోర్లు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల సమస్యను పరిష్కరించలేకపోవడంతో కూటమి ప్రభుత్వం మాట నీటి మూటేనని రైతులు విమర్శిస్తున్నారు.
పరిహారం కోసం రైతుల ధర్నా
నెల్లిమర్ల: తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు 1లో భాగంగా నిర్మిస్తున్న కాలువలో ముంపునకు గురవుతున్న తమ భూములకు పరిహారం వెంటనే చెల్లించాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సారిపల్లి గ్రామానికి చెందిన రైతులు తమకు న్యాయం చేయాలని శనివారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు పరిహారం చెల్లించిన తర్వాతే భూముల్లోని చెట్ల వేలం పాట వేయాలన్నారు. భూ సేకరణకు సంబంధించి అవార్డు ఎంక్వయిరీ కూడా సక్రమంగా చేయలేదని తహసీల్దారు దృష్టికి తీసుకొచ్చారు. అలాగే 1200 ఎకరాల భూములు కోల్పోయి, పూర్తిగా నిరాధారమైన తమ గ్రామానికి పీఏఎఫ్ ప్యాకేజీ మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ శ్రీకాంత్, ఇరిగేషన్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు మజ్జి రామారావు, సారిపల్లి గురునాధరావు, మజ్జి నాగరాజు, పాలూరి భానోజి తదితరులు పాల్గొన్నారు.


