నకిలీపురుగు మందులు
విజయనగరం ఫోర్ట్:
కంచే చేను మేసిన చందాన ఓ అధికారి తీరు వ్యవసాయశాఖలో చర్చనీయాంశంగా మారింది. రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు అందించాల్సిన అధికారే... భర్తతో కలిసి నకిలీ ఎరువులు, పురుగు మందుల విక్రయాన్ని ప్రోత్సహించడం వివాదాస్పదంగా మారింది. పంటలకు అశించే తెగుళ్లు, పురుగుల నివారించాలంటే నాణ్యమైన పురుగు మందులు అవసరం. నకిలీవి, నాణ్యతలేనివి పిచికారీచేస్తే తెగుళ్లు, పురుగుల నివారణ సాధ్యంకాదు. రైతులు పంట నష్టపోతారు. ఆ అధికారి మాత్రం ఇవేవీ ఆలోచించలేదు. రైతులు నష్టపోతే తమకేం అన్నట్టుగా వ్యవహరించారు. డబ్బు సంపాదనే ప్రధాన లక్ష్యంగా నకిలీ, నాసిరకం ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని వ్యవసాయ సిబ్బందిపై ఒత్తిడిపెంచారు. భర్త ఎరువుల వ్యాపారానికి సహకరిస్తూ దందాకు దిగారు. వీరి ఆగడాలు, అరాచకాలు శృతిమించడం, రైతులు నష్టపోతుండడంతో సిబ్బంది కొందరు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు నేరుగా ఫిర్యాదుచేశారు. అందులో ఆ అధికారి భర్తతో కలిసి చేస్తున్న దందాను వివరించారు. అయితే, ఈ విషయాన్ని వ్యవసాయ అధికారులు బయటకు పొక్కనీయకుండా గుట్టుగా విచారణ చేస్తున్నారు.
● గజపతినగరం సబ్ డివిజన్ వేదికగా...
గజపతినగరం వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ, గజపతినగరం మండలాల్లో ఏడాది కాలంగా నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నట్టు రైతుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఇక్కడ ఏడాది కిందట బాధ్యతలు స్వీకరించిన అధికారి నకిలీ ఎరువులను రైతులకు అట్టగట్టేందుకు ‘నిర్మల’ంగా స్కెచ్‌వేశారు. అక్రమ వ్యాపారానికి ‘జ్యోతి’ వెలిగించారు. కాలం చెల్లిన క్రిమి సంహారక మందులను రీసైక్లింగ్ చేసి రైతులకు విక్రయించినట్టు సమాచారం. వీటిని అ అధికారి తెరవెనక నుంచి ప్రమోట్ చేయగా, ఆమె భర్త ఎరువుల డీలర్లకు డిస్ట్రిబ్యూషన్ చేసినట్టు తెలిసింది. ఆ మందులనే విక్రయించేలా డీలర్లపై ఒత్తిడి తేవాలంటూ వ్యవసాయ సిబ్బందికి హుకుం జారీచేసినట్టు భోగట్టా.
● గుట్టుగా విచారణ
వ్యవసాయ శాఖ సిబ్బంది కమిషనర్‌కు ఇచ్చిన ఫిర్యాదుపై వ్యవసాయ అధికారులు గుట్టుగా విచారణ చేపట్టినట్టు సమాచారం. ఈ విచారణకు వ్యవసాయ ఏడీఏను కూడా పిలవడంతో కొంత భయపడుతూ ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు అన్నీ వాస్తవాలంటూ నిరూపించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది.
విచారణ సాగుతోంది..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గజపతినగరం సబ్ డివిజన్ ఏడీఏపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టాం. ఏడీఏ భర్త ఎరువులు, పురుగు మందుల డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేస్తున్న మాటవాస్తవమే. వ్యవసాయ శాఖ సిబ్బంది ఏడీఏపై ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ పూర్తయింది. నకిలీ ఎరువులు, పురుగు మందులపై వచ్చిన ఫిర్యాదుపై ఏడీఏ స్థాయి అధికారితో విచారణ చేపడతాం.
– వి.తారకరామారావు,
జిల్లా వ్యవసాయ అధికారి
భర్త వ్యాపారానికి సాయం..
రైతన్నకు సున్నం..
వెలుగులోకి ఓ వ్యవసాయాధికారి నాసిరకం మందుల వ్యాపార దందా
నకిలీ మందుల విక్రయానికి సహకరించాలంటూ సిబ్బందిపై ఒత్తిడి
వ్యవసాయశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన ఉద్యోగులు
గుట్టుగా విచారణ


