● డీఎంహెచ్‌ఓ జీవనరాణి
విజయనగరం ఫోర్ట్: మలేరియా వ్యాధి సోకిన వారు సకాలంలో చికిత్సతీసుకోవాలని డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి అన్నారు. విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మలేరియా వ్యాధిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు. దోమల నియంత్రణ కోసం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. జ్వరలక్షణాలు కనిపించిన వెంటనే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. మలేరియా నిర్మూలనకోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి సింహాచలం, డీఎల్‌ఓ కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐపై బదిలీ వేటు?
బాడంగి: బాడింగి పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసిన తారకేశ్వరరావును విజయనగరం క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబును ఇన్‌చార్జి ఎస్‌ఐగా నియమించించారు. ఎస్‌ఐను ఆకస్మికంగా బదిలీ చేయడం, బదిలీ ఆర్డర్ వచ్చిన గంటల్లోనే రిలీవ్ చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే ఎస్‌ఐను బదిలీ చేసినట్టు సమాచారం. తెలంగాణాకు చెందిన యూట్యూబ్ జర్నలిస్టు కేవీఆర్ ఎర్రబుక్‌ను ఎర్రిబుక్‌గా చేసి మాట్లాడాడన్న ఆరోపణపై టీడీపీ నాయకుడు, బాడంగి మాజీ సర్పంచ్ కండిరమేష్, ఎంపీటీసీ సభ్యుడు డి.శ్రీనివాసరావు 15 రోజుల కిందట ఎస్‌ఐకు ఫిర్యాదుచేశారు. దీనిపై కేసునమోదుచేసి సీఐ, ఎస్‌ఐ కలిసి కేవీఆర్‌ను అరెస్టుచేసి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ వెళ్లారు. అక్కడి జర్నలిస్టులంతా కలిసి అరెస్టును అడ్డుకున్నారు. 41 నోటీసులు జారీచేసి వెళ్లిపోవాలని, తామే పోలీస్‌సేషన్‌కు, లేదంటే కోర్టుకో కేవీర్‌ను తీసుకొస్తామని పూచీ పడడంతో ఎస్‌ఐ తిరుగుముఖంపట్టారు. చెప్పిన పనిని సక్రమంగా నిర్వర్తించనందుకు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఎస్‌ఐపై ఎస్పీ బదిలీవేటు వేసినట్టు భోగట్టా.
పక్కాగా ఎన్నికల రోల్స్ మ్యాపింగ్
పార్వతీపురం: జిల్లాలో ఎన్నికల రోల్స్ మ్యాపింగ్, ఫారంల పరిశీలన పారదర్శకంగా జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత తెలిపారు. తన చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నిర్వహించిన సమావేశంలో వాటి వివరాలను వెల్లడించారు. 2002 రోల్స్ డేటాను 2025 డేటాతో బీఎల్‌ఓల యాప్‌లో మ్యాపింగ్ చేస్తూ 68.53 శాతం పూర్తిచేసినట్లు పేర్కొన్నారు. గతేడాది జనవరి 6 నుంచి ఇప్పటి వరకు మొత్తం 16,799 దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు. వాటిలో 273 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫారం–6 కింద 7,437 దరఖాస్తుల్లో 6,358 కొత్త ఓటర్లు చేరారన్నారు. ఫారం–7 కింద 2,046 ఓట్లు తొలగించగా, నాలుగు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఫారం–8 కింద 6,934 సవరణలు పూర్తి చేశామని తెలిపారు. ఓటర్ల జాబితా కచ్చితత్వం కోసం రాజకీయ పార్టీల సహకారం అవసరమని ఆమె పేర్కొన్నారు.
రీ సర్వేను వేగవంతం చేయాలి
పార్వతీపురం: జిల్లాలో రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో వీఆర్వోలు, మండల, గ్రామ సర్వేయర్లతో రీసర్వే పురోగతిపై శనివారం సమీక్షించారు. దశలవారీగా సర్వే నిర్వహిస్తూ ఈకేవైసీని తప్పనిసరి చేయాలన్నారు. డ్రాప్ట్ దశకు ముందే అవసరమైన సవరణలు పూర్తిచేయాలని సూచించారు. 95 శాతం ఈకేవైసీ లక్ష్యం సాధించాలన్నారు. ప్రతి వీఆర్వో రోజుకు కనీసం 50 ఖాతాలు పూర్తి చేయాలన్నారు. ఫీల్డ్ వెర్ఫికేషన్‌లో ఫొటోలు అందుబాటులో లేకపోతే వాట్సాప్ ద్వారా సేకరించాలని తెలిపారు. జిరాయితీ ఖాతాల ఆమోదాన్ని ఆర్డీఓ స్థాయికి అప్పగించడంతో ప్రక్రియ వేగవంతం అవుతుందని పేర్కొన్నారు. మరణించిన వారి ఖాతాలను వారసులకు బదిలీ విషయంలో స్పష్టతతో పనిచేయా లని ఆదేశించారు.


