ఆతవ.. అభివృద్ధికి ఆవల | - | Sakshi
Sakshi News home page

ఆతవ.. అభివృద్ధికి ఆవల

Apr 25 2026 9:18 AM | Updated on Apr 25 2026 9:18 AM

శింగరాయిలో అభివృద్ధికి నోచుకోని ఆతవ చానల్‌ సిస్టం–1

వేపాడ: ఆతవ సాగునీటి చానల్‌–1.. వేపాడ మండలంలోని శింగరాయి, ఎల్‌.కోట మండలంలోని కిత్తన్నపేట, సంతపేట, ఎల్‌.కోట గ్రామాలకు చెందిన 2,500 ఎకరాలకు సాగునీటి ఆదరువు. చానల్‌ ఆనకట్ట పూర్తిగా శిథిలమైంది. వర్షాకాలంలో మారిక గెడ్డ నుంచి వస్తున్న నీరు వృథా అవుతోంది. చానల్‌లో నీరునిల్వ సామర్థ్యం తగ్గిపోవడంతో ఆయకట్టుకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతోంది. వర్షాలు అనుకూలించని సమయంలో చివరి దశలో పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు. ఆనకట్టకు మరమ్మతులు చేయాలని రైతులు వేడుకుంటున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. మరోవైపు శింగరాయి గ్రామంలో రామాలయం నుంచి ఊర్లోకి వెళ్లేందుకు ఆతవ చానల్‌ (గెడ్డ)పై దశాబ్దాల కిందట నిర్మించిన బిడ్జి శిథిలమైపోయింది. ఇరువైపులా నిర్మించిన రైలింగ్‌ పూర్తిగా పాడైంది. ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. భారీ వాహనాల రాకపోకలతో బ్రిడ్జి మధ్యలో కుంగిపోయింది. బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రతిపాదనలు పంపించాం

ఆతవ చానల్‌ సిస్టం–1 ఆనకట్ట అభివృద్ధికి జలధార–జలహారతి ప్రొగ్రాంలో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం.

– ఎం.హేమకుమార్‌, ఇరిగేషన్‌ ఏఈఈ

బ్రిడ్జి నిర్మించాలి

శింగరాయి రామకొవెల నుంచి ఊర్లోకి వెళ్లాలంటే చానల్‌ సిస్టం కాలువపై నిర్మించిన బ్రిడ్జే ఆధారం. దశాబ్దాల కిందట నిర్మించిన బ్రిడ్జి శిథిలమైంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో, ఎప్పుడు కూలిపోతుందో తెలియడంలేదు. తక్షణమే అధికారులు చొరవచూపి బ్రిడ్జి నిర్మించాలి.

– గేదెల సత్యం, పాలసంఘం సొసైటీ

అధ్యక్షుడు, శింగరాయి, వేపాడ మండలం

ఏటా సాగునీటి కష్టాలు

ఆతవ చానల్‌ సిస్టం–1ను అభివృద్ధి చేయడంలేదు. శిథిలమైన ఆనకట్టను బాగుచేయకపోవడంతో మారిక గెడ్డ నుంచి వచ్చే నీరు నిల్వ ఉండడంలేదు. పంటలకు సాగునీరు ప్రశ్నార్థకమవుతోంది. పాలకులు, అధికారులు స్పందించి ఆనకట్టను తక్షణమే బాగుచేయాలి. సాగునీరు ఇబ్బందులు లేకుండా చూడాలి.

– నిరుజోగి వెంకటరావు, మాజీ సర్పంచ్‌,

శింగరాయి గ్రామం, వేపాడ మండలం

నిర్లక్ష్యంలో సాగునీటి చానల్‌

పూడుకుపోయినా పట్టించుకోని వైనం

2,500 ఎకరాలకు సాగునీరు

ప్రశ్నార్థకం

ఆవేదనలో రైతాంగం

Advertisement
 
Advertisement
Advertisement