● జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
విజయనగరం రూరల్: గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని జెడ్పీ చైర్మన్, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జెడ్పీ సమావేశ మందిరంలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశాభివృద్ధిలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందేలా పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజలకు సేవలు అందించడంలో ప్రతిభ చూపిన డిప్యూటీ ఎంపీడీఓలు ముగ్గురికి, ఆరుగురు పంచాయతీ అభివృద్ధి అధికారులకు, ఒక్కో జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు, ముగ్గురు మండల స్థాయి కంప్యూటర్ ఆపరేటర్లకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి,, అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.


