రామభద్రపురం: అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు మంజూరు కావడం లేదు... కాస్త దయచూపాలంటూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయనను వేడుకున్నారు. పింఛన్ మంజూరుకాకపోవడంతో ఎదురవుతున్న ఆర్థిక కష్టాలపై ఏకరువుపెట్టారు. మండలంలోని నాయుడువలస సచివాలయం వద్ద శుక్రవారం ఎమ్మెల్యే బేబీనాయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇందులో మొత్తం 59 వినతులు అందగా.. వాటిలో పింఛన్లకు సంబంధించినవే 18 ఉండడం గమనార్హం. ఉపాధిహామీ సమస్యలు, రోడ్లు, కాలువలు నిర్మాణంలో అలసత్వం, భూ సమస్యలు, రేషన్, ఆరోగ్యశ్రీ కార్డుల జారీలో జాప్యంపై వినతులు అందాయి. పింఛన్లు మంజూరు చేయాలంటూ వృద్ధులు కన్నీరుపెట్టడంతో ప్రభుత్వం తీరు ఇలా ఉందంటూ విస్తుపోవడం అక్కడి వారి వంతైంది.


