వీరఘట్టం: వంగర మండలం రుషింగి నుంచి వీరఘట్టం మండలం చిట్టపులివలస గ్రామానికి కంకరను అక్రమంగా తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను జిల్లాకు చెందిన మైనింగ్ అధికారులు శుక్రవారం అడ్డుకున్నారు. వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు ఏఎస్సై సత్యనారాయణ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
బొబ్బిలి: పట్టణ సమీపంలోని సరేపోలమ్మ ఆలయం వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస పట్నాయక్ అనే వ్యక్తి గాయాల పాలయ్యాడు. ఓ పత్రికలో రిపోర్టర్‌గా పనిచేస్తున్న శ్రీనివాస పట్నాయక్ తన స్వగ్రామం జగన్నాథపురం నుంచి పట్టణంలోకి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి వెనుకవైపు నుంచి బైక్‌తో ఢీ కొని పరారయ్యాడు. వెంటనే స్థానికులు క్షతగాత్రుడిని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుడి దగ్గరకు ఏఎస్సై కొండల రావు వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.
8 పోక్సో కేసుల్లో
నిందితులకు జీవిత ఖైదు
విజయనగరం క్రైమ్: ఈ ఏడాది ఎనిమిది పోక్సో కేసులలో నిందితులందరికీ యావజ్జీవ ఖైదు విధించినట్లు చిన్నారులు, మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ పని చేస్తోందని ఎస్పీ దామోదర్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడేళ్లలో 46 పోక్సో కేసుల్లోను, 33 క్రైం ఎగినిస్ట్ వుమన్ కేసుల్లోను నిందితులకు కఠినమైన శిక్షలు విధించారన్నారు. పోక్సో కేసుల్లో ప్రాసిక్యూషన్ ఎప్పటికప్పుడు గమనిస్తూ, చర్యలు చేపట్టడం సత్ఫలితాలనిస్తోందన్నారు. 2024లో 10, 2025లో 28, ఈ ఏడాదిలో 8 పోక్సో కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు లేదా 20ఏళ్లు కఠిన కారాగార శిక్షలు విధించారన్నారు. మహిళల భద్రతకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని, అందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
భామిని: మండలంలోని బత్తిలి సమీపంలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు పెనప్రమాదం నుంచి త్రుటిలో బయటపడింది. శ్రీకాకుళం నుంచి బత్తిలి వస్తున్న ఆర్టీసీ బస్సు బత్తిలి వెర్రిగెడ్డ బ్రిడ్జి ప్రవేశంలో పక్కకు తిప్పి ఘోర ప్రమాదం నుంచి ప్రయాణికులను తప్పించింది. ప్రమాదం జరిగే సమయానికి బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. బ్రిడ్జి అంచు నుంచి గెడ్డలోకి దిగిపోవలసిన ఆర్టీసీ బస్సు వెనుక చాసీ గట్టుకు తగిలి గెడ్డలోకి పడకుండా బస్సు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.ప్రమాదం జరిగిన వెంటనే బత్తిలి గ్రామస్తుల సహకారంతో ప్రయాణికులను దించి వేశారు. డ్రైవర్, కండక్టర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
13 కేజీల గంజాయి పట్టివేత
విజయనగరం క్రైమ్: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీకి 66 వేలు విలువ చేసే 13 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తుండగా శుక్రవారం అడ్డుకున్నామని గవర్నమెంట్ రైల్వే ఎస్సై బాలాజీ రావు తెలిపారు. విజయనగరం రైల్వే స్టేషన్ లో తనిఖీలు చేస్తుండగా కర్ణాటక రాష్ట్రం షిమోగాకు చెందిన వి.వరుణ ఒడిశా రాష్ట్రంలోని టికిరి నుంచి గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించామని జీఆర్పీ ఎస్సై బాలాజీ రావు తెలిపారు. ఆర్పీఎఫ్ సిబ్బంది రైడ్ చేయగా వరుణ్ అడ్డంగా దొరికాడని, గంజాయి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విశాఖ రైల్వే కోర్టుకు తరలించామన్నారు.


