● రౌడీషీటర్ హరనాథ్‌గా హతుడి గుర్తింపు
● ఐదుగురు కలిసి హత్య
విజయనగరం క్రైమ్: స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసుగా నమోదైన పావాడ హరనాథ్‌ను అదే బస్తీలో ఉంటున్న స్నేహితులే గంజాయి మత్తులో హత్య చేసినట్లు ఎస్పీ శుక్రవారం తెలిపారు. ఆధిపత్యం కోసమే తోటి మిత్రుడిని ప్లాన్ చేసి అంతమొందించారన్నారు. ఈ కేసుకు సంబంధించి వన్ టౌన్ సీఐ ఆర్వేఆర్‌కే చౌదరి, క్రైమ్ ఎస్సై సురేంద్ర నాయుడు బృందం మిస్టరీని ఛేదించినట్లు తెలిపారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని జొన్నగుడ్డికి చెందిన పావాడ సంతోషి అనే మహిళ తన కొడుకు పావాడ హరనాథ్ మార్చి 27 వ తేదీ రాత్రి నుంచి కనిపించడం లేదని వన్ టౌన్ పోలీసులకు ఈ నెల10వ తేదీన ఫిర్యాదు చేయగా వన్ టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో విజయనగరం మండలం నారాయణ పురం గ్రామ శివారులోని నూతిలో ఒక వ్యక్తి.. మృతదేహం ఉన్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు పరిశీలించి మిస్సింగ్ అయిన పావాడ హరనాథ్‌గా గుర్తించారు. ఈ నేపథ్యంలో మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్పుచేసి, వన్ టౌన్ సీఐ దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతి చెందిన పావాడ హరనాథ్ పై రౌడీషీటు ఉన్నట్లు, ఇప్పటికే 15 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిసింది.
హత్య నేపథ్యం..
జొన్నగుడ్డిలో ఉంటున్న పావాడ హరనాథ్‌కు అదే ప్రాంతంలో ఉంటున్న బాక్సర్ (ఎ1) సొంటేన లక్ష్మణరావు అలియాస్ లక్ష్మణకు ఇటీవల గొడవ జరగ్గా ఇద్దరూ కొట్టుకున్నారు. అనంతరం తాను బాక్సర్ లక్ష్మణరావును కొట్టినట్లు పావాడ హరనాథ్ ఎక్కువగా ప్రచారం చేయడంతో ప్రతీకారం తీర్చుకోవాలని బాక్సర్ సొంటేన లక్ష్మణరావు భావించి, అవకాశం కోసం ఎదురు చూశాడు. ఇదే క్రమంలో బార్‌లో మద్యం తాగి మత్తులో బార్ బయట పడిపోయిన హరనాథ్‌ను గమనించిన సొంటేన లక్ష్మణరావు (30) అతని వర్గానికి చెందిన కుప్పిలి భార్గవ కుమార్ అలియాస్ భార్గవ్ (20), మచ్చ తేజ (20), రేగిడి వాసుదేవ్ అలియాస్ వాసు (26) ఆటోలో హరనాథ్‌ను పట్టణ శివార్లలోకి తరలించి, అక్కడ రాళ్లతో కొట్టి హత్య చేసి, మృతదేహాన్ని సిమెంట్ పోల్‌కు తాళ్లతో కట్టి, ఫ్లెక్సీ కప్పేసి పరారయ్యారు. ఇదే కేవలం ఇరు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరుతో జరిగిన హత్య అని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పావాడ హరనాథ్‌ను హత్య చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించామన్నారు. అంతేకాకుండా, నిందితులకు సహకరించిన మరో జువైనల్‌ను అదువులోకి తీసుకున్నామని చెప్పారు. సమావేశంలో విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు పాల్గొన్నారు.


