పూసపాటిరేగ: తీరప్రాంతమైన మండలంలోని చింతపల్లిలో మంజూరైన జెట్టీ నిర్మాణంపై సర్కారు నిర్లక్ష్యం వహిస్తోంది. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రెండేళ్లుగా ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణ ప్రక్రియపై నోరు మెదపలేదు. గత ప్రభుత్వంలో రూ.23 కోట్లతో మత్స్యకారుల సంక్షేమానికి ఫ్లోటింగ్ జెట్టీ మంజూరు చేయించారు. అన్ని అడ్డంకులు తొలిగి ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన తరువాత అప్పటి సీఎంవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వర్చువల్ విధానంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి సుమారు 2ఏళ్లయిన తర్వాత ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణాన్ని రూ.16 కోట్లకు కుదిస్తూ ఆదేశాలు వచ్చినట్లు సమాచారం అందడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు అంటే ప్రభుత్వానికి ఎందుకు అంత చులకన భావమంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో తీరప్రాంత మత్స్యకారులకు ప్రధాన అవసరమైన చింతపల్లిలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణంపై తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తున్నారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు మత్స్యకారుల వలస జిల్లాలో తీరప్రాంతమైన పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో ఉన్న 27 కిలోమీటర్ల తీరంలో సుమారు 21 వేల మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారిలో 6 వేల మంది చేపల వేటే ప్రధాన వృత్తిగా జీవిస్తున్నారు. వారిపై పరోక్షంగా 15 వేల మంది ఆధారపడి జీవిస్తున్నారు. రెండు మండలాల్లో 885 బోట్లలో సుమారు 4 వేల మంది మత్స్యకారులు నిత్యం వేట సాగిస్తుంటారు. జెట్టీ లేకపోవడంతో వేట సాగకపోవడం తదితర కారణాలతో జీవనోపాధి కోసం విశాఖపట్నం, గుజరాత్, హీరావల్, సూరత్ తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి వలస బాట పడుతున్నారు.
కాలుష్యంతో మత్స్యసంపద నాశనం
జెట్టీ నిర్మాణంలో అలసత్వం, పరిశ్రమల వ్యర్థ రసాయనాలు తమపొట్ట కొడుతున్నాయని పలువురు మత్స్యకారులు వాపోతున్నారు. రసాయన పరిశ్రమల వ్యర్థ జలాలు సముద్రంలో కలవడంతో మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతోంది. కొంత కాలం క్రితం వరకు వేటకు భారీగా మత్స్య సంపద దొరికేది. నేటి పరిస్థితి చూస్తే భిన్నంగా ఉందని మత్స్యకారులు వాపోతున్నారు. చేపలవేట సాగకపోవడంతో వలస బాట పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చింతపల్లి తీరంలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మాణంపై అడుగులు వేయాలని మత్స్యకారులు కోరుతున్నారు.
గత ప్రభుత్వంలో జెట్టీ నిర్మాణానికి రూ.23 కోట్లు మంజూరు
పట్టించుకోని కూటమి సర్కారు
తాజాగా నిర్మాణానికి రూ.16 కోట్లకు కుదిస్తున్నట్లు సమాచారం
ప్రకృతి వైపరీత్యాల్లో వేట సాగక ఇబ్బంది పడుతున్న గంగపుత్రులు
జెట్టీ మంజూరు చేయించినా ఫలితం లేదు..
జిల్లా తీరప్రాంత మత్స్యకారులకు సుమారు రూ.23 కోట్లతో ఫ్లోటింగ్ జెట్టీ మంజూరు చేయించాం. మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని జెట్టీ నిర్మిస్తే జీవనపరిస్థితులు మెరుగుపడతాయని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన చేసి మంజూరు చేసి శంకుస్థాపన చేశారు. అయితే తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు సుమారు రెండేళ్లు అవుతున్నా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మత్స్యకారుల సంక్షేమాన్ని గాలికి వదిలేయడాన్ని గంగపుత్రులు గమనిస్తున్నారు. జెట్టీ నిర్మాణానికి అడుగులు ముందుకు వేసి గతంలో మంజూరు చేయించిన నిధులుతోనే నిర్మాణాలు జరిపి మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయాలి.
బడ్డుకొండ
అప్పలనాయుడు, నెల్లిమర్ల మాజీ ఎంఎల్‌ఏ
ఉపాధికోసం ఎదురు చూపులు..
చేపల వేటపైనే ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు జెట్టీ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. జెట్టీ లేకపోవడంతో పాటు పరిశ్రమల కాలుష్యంతో వేట సాగక చాలా ఇబ్బంది పడుతున్నారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మత్స్యకారుల కలను సాకారం చేయాలి.
బర్రి చినఅప్పన్న, జిల్లా మత్స్యకార సహకార సొసైటీ మాజీ అధ్యక్షుడు విజయనగరం


