● జిల్లా నుంచి భువనేశ్వర్ వెళ్లివచ్చిన 84 మంది విద్యార్థులు
పాలకొండ రూరల్: ఏదైనా ఓ దృశ్యం చూస్తే దానిని మరిచిపోవడం దాదాపు అసాధ్యం..తరగతి గదిలో అందించే బోధనతో పోల్చుకుంటే నేరుగా ఓ అంశం పనితీరును చూపిస్తే ఆసక్తి మరింత పెరుగుతుంది. చూసిన విషయాలపై పలువురిలో చర్చ సాగుతుంది. దీనినే అసరాగా చేసుకుని విద్యాశాఖ విద్యార్థులకు బోధనతోపాటు వారిలో శాసీ్త్రయ అవగాహన కల్పించే చర్యలు చేపట్టింది. వివిధ పాఠశాలల నుంచి ఈ ఏడాది సైన్స్ ఎగ్జిబిషన్, నేషనల్ సైన్స్‌డే, వికసిత్ భారత్ తదితర కార్యక్రమాల్లో ప్రతిభ కనబర్చిన 84 మంది విద్యార్థులను సైన్స్ ఎక్స్‌పోజర్ టూర్‌కు ఎంపిక చేశారు. సదరు విద్యార్థులను జిల్లా సైన్స్ అధికారి గిరడ లక్ష్మణరావు సారథ్యంలో 16 మంది ఉపాధ్యాయులు మెంటర్స్‌గా వ్యవహరిస్తూ అంతరాష్ట్ర పర్యటనకు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు తీసుకువెళ్లారు.
భువనేశ్వర్‌లో పలు ప్రాంతాల సందర్శన
పాఠశాల స్థాయిలో శాసీ్త్రయ విజ్ఙానంపై దృశ్య రూపంలో అవగాహన పెంచుకునేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో భువనేశ్వర్ వెళ్లిన విద్యార్థులు అక్కడి ప్రముఖ ఐఐటీ కేంద్రం, అడ్వాన్స్ రోబోటిక్స్ ల్యాబ్, మెషిన్ టూల్స్ ల్యాబ్, ఫ్లూయిడ్ డైనమిక్స్ ల్యాబ్‌తోపాటు మెటీరియల్ టెస్టింగ్ ల్యాబ్, స్కూల్ ఆఫ్ బేసిక్ సైన్స్ ల్యాబ్ నిర్వహణను నేరుగా సందర్శించి, అక్కడి విద్యార్థులు, నిర్వాహకులతో మమేకమయ్యారు. ఒడిశాకు చెందిన శాస్త్రవేత్తలు, అధ్యాపకులతో చర్చించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై విలువైన సమాచారం సేకరించారు. ప్రపంచ ప్రఖ్యాత యునెస్కో వారసత్వ ప్రదేశమైన కోణార్క్ సూర్యదేవాలయం సందర్శనలో దేవాలయ నిర్మాణంలో దాగి ఉన్న ఆర్కిటెక్చర్, విశిష్ట, ఖగోళ విజ్ఞానంపై అవగాహన పొందారు. సూర్యకిరణాల స్థానానుసారం కచ్ఛితమైన సమయ నిర్ధారణ ఏ విధంగా చేశారో వీక్షించారు. నందన్ కానన్ గల జూలాజికల్ పార్కు సందర్శనలో జీవ వైవిధ్యం, ప్రకృతితో మమేకమై జీవాల మనుగడపై విఫులంగా తెలుసుకున్నారు. లింగరాజ్ ఆలయంలో పొందుపర్చిన భారతీయ శిల్పకళ, రీజనల్ సైన్స్ సెంటర్, సైన్స్‌పార్కు, డైనోసార్ పార్కు, త్రీడీ షో వంటి ఆసక్తి అంశాలను వీక్షించారు. తద్వారా సృజనాత్మకత, శాసీ్త్రయత, పరిశోధనాత్మక దృక్పథంపై విద్యార్థులు మక్కువ పెంచుకునేలా ఆసక్తి కనబరిచారు. అంతరాష్ట్ర పర్యటనలో తెలుసుకున్న అంశాలపై సదరు విద్యార్థులు సహ విద్యార్థులకు తమ అనుభవాలను పంచనున్నారు.


