● వచ్చే నెల 7 నుంచి నెల్లూరు జిల్లాలో జరగనున్న పోటీలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సీ్త్ర, పురుషుల బీచ్ కబడ్డీ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్లు సిద్ధమయ్యాయి. జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో బాలుర విభాగంలో 8 మంది, బాలికల విభాగంలో 8 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 7 నుంచి 10వ తేదీ వరకు నెల్లూరు జిల్లా దువ్వూరులో జరగబోయే 13వ ఆంధ్ర అంతర్ జిల్లాల బీచ్ కబడ్డీ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇదిలా ఉండగా జిల్లా స్థాయిలో ఎంపికై న బాలుర క్రీడాకారులకు నెల్లిమర్ల మండలం సారిపల్లి గ్రామంలో, బాలికలకు విజయనగరంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిక్షణ శిబిరం నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి కేవీ ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన లక్ష్మణరావులు తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జిల్లా పేరు ప్రఖ్యాతులు చాటి చెప్పాలని ప్రోత్సహించారు.
రోడ్డు పక్కన వ్యక్తి మృతి
సాలూరు రూరల్: మండలంలోని నార్లవలస పంచాయతీ బొర్రపలుకువలస గ్రామానికి చెందిన చిక్కుడుసరువు(50) గురువారం ఉదయం మామిడిపల్లి గ్రామసమీపంలో రోడ్డుపక్కన మృతిచెంది పడి ఉన్నాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆయన మంగళవారం ఒడిశాలోని తన బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి మామిడిపల్లి సమీపంలో మృతిచెందినట్లు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉందని రూరల్ ఎస్సై రవీంద్రరాజు తెలిపారు.
విద్యుత్ షాక్‌తో వ్యక్తికి గాయాలు
చీపురుపల్లిరూరల్(గరివిడి): మండలంలోని పెదనడిపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌తో పొట్నూరు తౌడు అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం జరిగిన ఈ సంఘటనలో గాయాలపాలైన తౌడును చీపురుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు పీఎం సూర్యఘర్ పథకంలో భాగంగా ఓ ఏజెన్సీ పెదనడిపల్లిలో సోలార్ విద్యుత్ అమర్చే పనులు చేపడుతోంది. దీంతో స్థానికంగా విద్యుత్ పనులు తెలిసిన తౌడును తాత్కాలికంగా పనుల కోసం పెట్టుకున్నారు. అయితే సోలార్ పనులు జరుగుతున్న సమయంలో ఇంటిపైన ఉన్న హైటెన్షన్ వైర్లు తౌడుకు తగలడంతో గాయాలయ్యాయి.
వచ్చే నెల 8 నుంచి సర్
విజ్జీ టీ–20 టోర్నీ
● జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు
విజయనగరం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 8 నుంచి జిల్లా స్థాయిలో పురుషులకు సర్ విజ్జీ టీ–20 క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి పి.సీతారామరాజు గురువారం తెలిపారు. జిల్లాలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం నుంచి ఉద్యోగం చేస్తున్న తల్లిదండ్రుల పిల్లలు, స్థానికంగా చదువుతున్న క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు. పూర్తిగా నాకౌట్ పద్ధతిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు ఎటువంటి ప్రవేశ రుసుం లేదని వెల్లడించారు. జట్టు నమోదు సమయంలో క్రీడాకారులు ఆధార్‌కార్డులు తప్పని సరిగా పొందుపరచాలని సూచించారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈనెల 30వ తేదీలోగా తమ జట్టు పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాకలు ఫోన్70135 08010, 7382482535 నంబర్లను సంప్రదించాలని పిలుపునిచ్చారు.
వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం
విజయనగరం రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రమైన రామనారాయణంలో సీతారాముల కల్యాణ మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పునర్వసు నక్షత్రం పురస్కరించుకుని, ఆలయ అర్చకులు చాణక్య, హర్ష, కృష్ణతేజలు స్వామి కల్యాణం జరిపించారు. భక్తులు పెద్దసంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని, కల్యాణ వైభోగాన్ని కనులారా తిలకించారు.


