మోసకారి కూటమికిబుద్ధి చెప్పండి | - | Sakshi
Sakshi News home page

మోసకారి కూటమికిబుద్ధి చెప్పండి

Apr 24 2026 5:44 AM | Updated on Apr 24 2026 5:44 AM

గజపతినగరం రూరల్‌:

రాష్ట్రంలో చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసింది.. పంటను మద్దతు ధరకు కొనుగోలుచేసేవారు లేక మొక్కజొన్న రైతు కన్నీరు పెడుతున్నా కనీసం పట్టించుకోవడంలేదు.. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. గజపతినగరంలోని బెల్లాన కన్వెన్షన్‌లో నియోజకవర్గ గ్రామ కమిటీల విస్తృతస్థాయి సమావేశం, నూతనంగా నియామకమైన పార్టీ మండలాధ్యక్షుడు పల్లి సంజీవరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కో–ఆర్డినేటర్‌ బూడి వెంకటరావు బాధ్యతల స్వీకరణకు బొత్స ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నది లేనిట్లు.. లేనిది ఉన్నటు సృష్టించడంలో చంద్రబాబు దిట్ట అని విమర్శించారు. ఆచరణ సాధ్యంకాని హామీలతో అందలమెక్కి... ప్రజలను నయవంచనకు గురిచేశారన్నారు. ఎన్నికల సమయంలో తమకున్న పచ్చమీడియాతో ప్రజలను తప్పుదోవ పట్టించి అధికారం చేజిక్కించుకున్నారని ఆరోపించారు. తల్లికి వందనం పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను సైతం చంద్రబాబు మోసంచేశారని విమర్శించారు. పథకం లబ్ధిదారులందరికీ అందడంలేదన్నారు. ఉపాధిహామీ పథకాన్ని డొల్ల చేశారని, వంతుల వారీగా కూలీలకు పని కల్పించడం సిగ్గుచేటన్నారు. అన్నదాతను విత్తు నుంచి ఎరువుల వరకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

● తమ ప్రభుత్వ హయాంలో డ్వాక్రా మహిళలకు పావలా/సున్నా వడ్డీకే రుణాలు అందజేశామని, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో పావలా వడ్డీ రుణాలు అందని పరిస్థితి నెలకొందని బొత్స విమర్శించారు. రూ.3,60,000 కోట్లు అప్పులుచేసి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. దోచుకోవడం, దాచుకోవడం పనిలో తెలుగుదేశం నేతలు నిమగ్నమయ్యారన్నారు. తమ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం బాధాకరమన్నారు.

గీతం యూనివర్సిటీకి ఐదువేల కోట్ల విలువచేసే ప్రభుత్వ భూములను కట్టబెట్టడం ప్రభుత్వ దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు. కొత్తగా ఒక వితంతుకు పింఛన్‌ ఇవ్వని చంద్రబాబు ప్రభుత్వం, రెండేళ్లు తర్వాత వితంతు పింఛన్లు కానుక అంటూ సిగ్గులేని మాటలు ఆడుతుందన్నారు. క్షేత్రస్థాయిలో అవినీతి, దోపిడీ, హత్యరాజకీయాలు ఎక్కువయ్యాయని, వీటిని వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరారు. ఇదే తరహాలో మిగిలిన నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.

● మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మాట్లాడుతూ, గత ఎన్నికల్లో పార్టీ నాయకుల నిర్లక్ష్యం, మితిమీరిన ధీమా కారణంగానే ఓడిపోయమన్నారు. రాబోయే ఏ ఎన్నికల్లోనైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రైతు లు ఈ ప్రభుత్వంలో కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు. ఎరువులు, విత్తనాలు దగ్గర నుంచి రైతు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి ఎక్కడ అన్నారు. సమావేశంలో విజయనగరం పార్లమెంట్‌ పరిశీలకులు కిల్లి సత్యనారాయణ, నియోజకవర్గ పరిశీలకులు సిరిపురపు జగన్‌మోహనరావు, జిల్లా ఎస్సీసెల్‌ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌ కుమార్‌, బొత్స సందీప్‌, జడ్పిటిసిలు గార తౌడు, వర్రి నరసింహమూర్తి, రౌతు రాజేశ్వరి, ఎంపీపీలు బెల్లాన జ్ఞాన దీపిక , పిరుబండి హైమావతి,గేదెల సింహాద్రి అప్పలనాయుడు, సీహెచ్‌ చిన్నమనాయుడు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ వేమిలి ముత్యాలనాయుడు, జిల్లా క్రికెట్‌ సంఘం మాజీ కార్యదర్శి నారాయణమూర్తిరాజు, పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

జాక్‌పాట్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కొండపల్లి శ్రీనివాస్‌ అవినీతిలో ముందంజలో ఉన్నారని, ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడే పరోక్షంగా పేర్కొన్నారని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు అన్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ అవినీతి కార్యక్రమాలు చేయడంలో ఆరితేరాని విమర్శించారు. అధికారం చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా నియోజకవర్గంలో అభివద్ధి జాడలు మచ్చుకై నా కనిపించడం లేదన్నారు. ఎంఎస్‌ఎంఈ మంత్రిని... జిల్లాకు పరిశ్రమలు తెస్తానంటూ గొప్పలు చెప్పుకోవడం మినహా నియోజవర్గానికి ఒక్క పరిశ్రమ అయినా తేగలిగారా అని ప్రశ్నించారు. రాబోయే 2029 ఎన్నికల్లో ఓడిపోతామని భయంతోనే కలెక్షన్లు మొదలుపెట్టారని ఆరోపించారు. తమ ప్రభుత్వం హయంలో నియమించిన తాత్కాలిక ఉద్యోగులను కక్ష సాధింపుగా తొలగించడం అన్యాయమన్నారు. 2024 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి, పచ్చ మీడియాతో జనాల్లో విష బీజాలు నాటి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రజలకు రెండేళ్లలో చంద్రబాబు మోసకారి పాలన అర్థమైందని, రాబోయే ఎన్నికల్లో ఓటమి ఖాయమన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏ ఒక్కరూ అధైర్య పడవద్దని.. మీ వెన్నంటే మేము ఉంటామని.. భయం మా బ్లడ్‌లో లేదని, ఖబడ్దార్‌ అంటూ సవాల్‌ చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా జలధార–జలహారతి పేరుతో మరో దోపిడీకి శ్రీకారం చుట్టిందని మాజీ ఎమ్మెల్యే, గజపతినగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొత్స అప్పలనరసయ్య విమర్శించారు. దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ, అభివద్ధిపై లేదన్నారు. ఈ రెండేళ్లలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ నియోజకవర్గ అభివద్ధికి ఏం చేశారని ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే భీమసింగి సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామన్న హామీని మరిచిపోయారన్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీకి అనుకూల ఓట్లు తొలగించమని మంత్రి స్వయంగా రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటన్నారు. గత ఎన్నికల్లో ఈవీఎంల వల్లే తాము ఓడిపోయామన్నారు. నియోజకవర్గంలో ప్రజాబలం తమకే ఉందని, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలందరూ సైనికుల వలే పనిచేయాలని, ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.

మొక్కజొన్న రైతు కన్నీరు

కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం

పింఛన్ల మంజూరులో నిర్లక్ష్యం

ప్రజాసంక్షేమ పథకాలు అందని వైనం

చంద్రబాబు ప్రభుత్వం తీరును

ఎండగట్టిన శాసనమండలి విపక్ష నేత

బొత్స సత్యనారాయణ

Advertisement
 
Advertisement
Advertisement