విజయనగరం అర్బన్: జిల్లాలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు శుక్రవారం నుంచి జూన్ 11వ తేదీ వరకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించిందని డీఈఓ యు.మాణిక్యంనాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను తప్పనిసరిగా అమలుచేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలలు, విద్యాసంస్థలు నిర్దేశిత సెలవులను కచ్చితంగా పాటించాలన్నారు. ఆదేశాలను ఉల్లంఘించిన యాజమాన్యాలపై ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హెచ్‌ఐవీ నిర్మూలనపై శ్రద్ధ అవసరం
● రాష్ట్ర ఏపీశాక్స్ పీడీ రోణంకి గోపాలకృష్ణ
విజయనగరం ఫోర్ట్: వైద్యారోగ్యశాఖ చేపట్టే కార్యక్రమాలతో పాటు హెచ్‌ఐవీ నిర్మూలనపై దృష్టిసారించాలని రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణశాఖ (ఏపీ శాక్స్) ప్రాజెక్టు డైరెక్టర్ రోణంకి గోపాలకృష్ణ అన్నారు. వైద్యారోగ్యశాఖ, వైద్యవిద్య, ఎయిడ్స్ నియంత్రణ శాఖ అధికారులతో గురువారం జూమ్‌కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎయిడ్స్ నియంత్రణపై పనిచేస్తున్న సిబ్బంది పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ, డీఎంహెచ్‌ఓ ఎస్.జీవనరాణి, తదితరులు పాల్గొన్నారు.
జీతం పెంచండి బాబూ..
బాడంగి: చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జీతాలు పెంచాలని, మేనెల మొత్తం వేసవిసెలవులుగా ప్రకటించాలని, మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేయాలని కోరుతూ అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద గురువారం ధర్నా చేశారు. యూనియన్ నాయకులు చింతాడ రమణమ్మ, లక్ష్మి, సీత తదితరులు మాట్లాడుతూ అంగన్‌వాడీల 10 డిమాండ్లలో 9 నెరవేర్చేశామని, జీతాలపెంపు ఒక్కటే మిగిలిందని సంబంధిత మంత్రి అవాస్తవాలు ప్రకటించడంపై మండిపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా నేటికీ జీతాలు పెరగలేదని, 164 సూపర్‌వైజర్ పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయని, వేసవి సెలవుల జీఓ ఇవ్వలేదని, వేతనంతో కూడిన మెడికల్‌లీవ్ ఇవ్వలేదని, సంక్షేమ పథకాల అమలు, తదితర సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయన్నారు. వాటిని సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో వీరితో పాటు నియోజకవర్గ స్థాయి అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, మినీ అంగన్‌వాడీలు పాల్గొన్నారు.
మద్యం తాగితే కేసులు నమోదు చేస్తాం
● ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
డెంకాడ: గంజాయి క్రయవిక్రయాలు జరిపేవారిపైన, బహిరంగంగా మద్యం సేవించే వారిపై కేసులు నమోదుచేసి కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. గంజాయి నిందితుల ఆస్తులు జప్తుచేస్తున్నామని తెలిపారు. చట్టబద్దంగా నడుచుకునేవారిపై ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుదన్నారు. డెంకాడ పోలీస్టేషన్‌లో పోలీస్ విశ్రాంత గదులు, ప్రజా సహాయక కేంద్రం, చలివేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్‌లకు వచ్చే లింక్‌లను ఓపెన్ చేయవద్దన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు దెబ్బ తగలడం వల్ల మరణాలు సంభవిస్తున్నాయని, హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చన్నారు. డెంకాడ, భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లోని జాతీయ రహదారిపై వాహనాలు నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ పెట్రోలింగ్ సిబ్బందిని ఆదేశించామన్నారు. కార్యక్రమంలో విజయనగరం ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు, భోగాపురం సీఐ జి.రామకృష్ణ, ఎస్‌ఐ ఎ.సన్యాసినాయుడు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


