అప్పుల కుప్పలు.. అభివృద్ధికి తిప్పలు | - | Sakshi
Sakshi News home page

అప్పుల కుప్పలు.. అభివృద్ధికి తిప్పలు

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

సాలూరు: చంద్రబాబు ప్రభుత్వం తీరు ‘అప్పులు కుప్పలు.. అభివృద్ధికి తిప్పలు’ అన్న చందంగా మారిందని జెడ్పీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు విమర్శించారు. సాలూరు పట్టణంలో వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యులు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఇటీవల పదవీ విరమణ పొందిన సర్పంచ్‌లను బుధవారం సన్మానించారు. కార్యక్రమానికి అరకు ఎంపీ గుమ్మ తనూజారాణి, వైఎస్సార్‌సీపీ జిల్లా రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బూడి ముత్యాలునాయడులతో పాటు మజ్జి శ్రీనువాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్‌ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంలో అప్పులు చేసి అవినీతికి పాల్పడడమే తప్ప అభివృద్ధి లేదని విమర్శించారు. సాలూరు నియోజకవర్గంలో రాజన్నదొర హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. గిరిజనుల ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, గిరిజనులను మంత్రి సంధ్యారాణి మోసం చేస్తున్నారని ఆరోపించారు. దోచుకుందామన్న రీతిలో మంత్రి వ్యవహార శైలి ఉందని విమర్శించారు. ప్రజల కష్టాలు గురించి మాట్లాడితే, తిరిగి నాకు జ్వరం వచ్చింది.. నన్నెవరు చూస్తారని బాధ్యతారాహిత్యంగా మాట్లాడడం మంత్రికి తగదన్నారు. గత ప్రభుత్వంలో నిర్మించిన రోడ్లు, సచివాలయాల భవనాలు, ఆస్పత్రులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడం తప్ప మంత్రి ఈ రెండేళ్ల పాలనలో కొత్తగా చేసిన అభివృద్ధి పనులు శూన్యమన్నారు. ఎంపీ గుమ్మ తనూజారాణి అరకు పార్లమెంట్‌ పరిధిలోని గిరిజనుల సమస్యలపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ, గిరిజనులకు మేలుచేసేందుకు కృషిచేస్తున్నారన్నారు. గిరిజన మంత్రి ఇక్కడి సమస్యలపై ఏనాడైనా అసెంబ్లీలో ప్రస్తావించారా అని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో మంత్రి, ఆమె కుటుంబంపై వచ్చిన ఆరోపణలు అందరికీ తెలిసినవేనన్నారు. ప్రజ్యావతిరేక పాలన సాగిస్తున్న మంత్రిపై త్వరలోనే కూటమి నేతలే తిరుగుబాటు చేస్తారన్నారు.

● మొక్కజొన్న రైతులను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జెడ్పీ చైర్మన్‌ మండిపడ్డారు. యూరియా కోసం రైతులు పడిన అగచాట్లు ఇంకా ఎవ్వరూ మరిచిపోలేదన్నారు. ప్రజా సమస్యలను లెవనెత్తుతామనే భయంతో టీడీపీ ప్రజాప్రతినిధులు జెడ్పీ సమావేశాలకు రావడం లేదని విమర్శించారు. అధికారం కోల్పోయిన తరువాత పార్టీలోని పెద్ద నాయకులు పార్టీని వీడినా జగనన్న, రాజన్నదొర వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఉండడం గర్వంగా ఉందన్నారు. పదవీ విరమణ చేసినా ప్రజాసేవలో తరించాలని, ప్రజల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.

● వైఎస్సార్‌సీపీ జిల్లా రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బూడి ముత్యాలునాయడు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, 2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించి జగన్‌మోహన్‌రెడ్డిను ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేద్దామన్నారు. కార్యక్రమంలో తాజామాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రాజన్నదొర హయాంలోనే సాలూరు నియోజకవర్గ అభివృద్ధి

గిరిజన సమస్యలను పట్టించుకోని

మంత్రి

ఆమైపె కూటమి నేతలే తిరుగుబాటు చేసేరోజు వస్తుంది

జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు

ఇటీవల పదవీకాలం పూర్తయిన

సర్పంచ్‌లకు సన్మానం

సర్పంచ్‌లతో విజయోత్సవ సభ నిర్వహిద్దాం

వైఎస్సార్‌సీపీతో ఉంటూ.. జగనన్న, రాజన్న దొరల నాయకత్వంలో నడుస్తూ.. క్షేత్రస్థాయిలో ప్రజలకు అండగా నిలుస్తూ.. ప్రజలు ఆశీస్సు లు చూరగొంటున్న సర్పంచ్‌ల సేవలు అభినందనీయమని ఎంపీ గుమ్మ తనూజరాణి అన్నారు. సర్పంచ్‌ కుటుంబం నుంచి ఎంపీగా ఎదిగినట్టు పేర్కొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అందరూ మళ్లీ విజేతలుగా నిలిచి విజయోత్సవ సభ నిర్వహించుకుందామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement