బొబ్బిలిరూరల్: సహజవనరులను కాపాడాల్సిన ప్రజాప్రతినిధి.. ఇసుక దోపిడీకి ఊతమిస్తుండడం... ఇసుక తవ్వకాల్లో వాటాకోసం అక్రమార్కులకు అండగా నిలబడడం.. కళ్లముందరే వేగావతి నదిని గుల్లచేస్తున్నా పట్టనట్టు ఉండాలంటూ రెవెన్యూ అధికారులకు హుకుం జారీచేయడం.. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకోవద్దని.. పట్టుకున్నా విడిచిపెట్టాలంటూ ఆదేశాలివ్వడం బొబ్బిలిలోని రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా మారింది. ఓరి ‘నాయనో’... ఆ వేధింపులు భరించలేమంటూ గగ్గోలు పెడుతున్నారు. బొబ్బిలి మండలంలోని పారాది, పెంట, అలజంగి, కారాడ గ్రామాల్లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగుతున్నా ప్రజానిధి బెదిరింపులకు అటువైపు కన్నెత్తిచూసేందుకు భయపడుతున్నారు.
విడిచిపెట్టేయండి...
వేగావతి నదిలో ఇష్టారాజ్యంగా సాగుతున్న తవ్వకాలపై స్థానికులు అందించిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు ఈ నెల 19న దాడులు చేశారు. ఆర్‌ఐ రామకుమార్ పారాది, అలజంగి వద్ద నిఘాపెట్టి ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను సీజ్ చేశారు. వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు. వాటికి జరిమానా విధించేందుకు సిద్ధపడ్డారు. అక్రమ వ్యాపారులందరూ అధికార పార్టీకి చెందిన చోటానాయకులు కావడంతో స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ పెట్టారు. అంతే.. తమవారి ట్రాక్టర్లను వదిలేయా లని తహసీల్దార్‌ను ఆదేశించారు. దీనికి అధికారులు ససేమిరా అంటూ రూ.10వేలు చొప్పున అపరాధ రుసుం విధించాలని నిర్ణయించారు. అయితే, అందులో అలజంగికి చెందిన టీడీపీ చోటా నాయకుడి ట్రాక్టర్‌ను ఎలాంటి అపరాధ రుసుం లేకుండా విడిచిపెట్టాలని రెవెన్యూ అధికారులకు ప్రజాప్రతినిధి హుకుం జారీచేశారు. అధికారులు సాధ్యం పడదని చెబితే వారిపై ఓ దశలో తీవ్ర పదజాలంతో విరుచుకుపడినట్టు సమాచారం. తమ పార్టీ ముఖ్యనాయకుడని, ఇసుక అక్రమ వ్యాపారిగా చూడవద్దని, ఇప్పుడు కాకుంటే మరెప్పుడు కాసులు కూడబెడతారంటూ చిందులు తొక్కినట్టు తెలిసింది. చేసేదిలేక ఆ ట్రాక్టర్‌కు మినహాయించి మిగిలిన 4 ట్రాక్టర్లకు రూ.10 వేలు చొప్పున జరిమానా విధించి వదిలేయడం ఇప్పుడు బొబ్బిలిలో చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి ‘రాజరిక’ పాలన అంటూ అధికారులు నివ్వెరపోతున్నారు. ఇసుక అక్రమతవ్వకాలతో కాసులను ‘కోట’కు చేర్చేందుకు ఎంతటికై నా దిగజారుతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇసుక అక్రమతరలింపునకు
ప్రజాప్రతినిధి అండ!
ట్రాక్టర్లను పట్టుకున్న రెవెన్యూ
అధికారులకు చీవాట్లు
విడిచిపెట్టేయాలంటూ హుకుం
ప్రజాప్రతినిధి తీరుపై విమర్శల వర్షం


