పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి

Apr 23 2026 8:12 AM | Updated on Apr 23 2026 8:12 AM

నేటి నుంచి మే 20వ తేదీ వరకు

వివిధ పరీక్షలు

విజయనగరం అర్బన్‌: జిల్లాలో నిర్వహించబోయే వివిధ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్టులు పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సీహెచ్‌ సత్తిబాబు ఆదేశించారు. తన చాంబర్‌లో వివిధ శాఖల ప్రతినిధులు, కళాశాలల నిర్వాహకులతో పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగాలని సూచించారు. జిల్లాలోని లెండి, అవంతి, ఎంవీజీఆర్‌, సీతం ఇంజినీరింగ్‌ కళాశాలతో పాటు అయాన్‌ డిజిటల్‌ కేంద్రాల్లో ఈ నెల 23 నుంచి మే 20 వరకు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గురువారం ఏపీ ఈసెట్‌, ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు ఏపీ పీజీఈసెట్‌, మే 2న ఏపీఐసెట్‌, 4న పీజీ లాసెట్‌, 8న ఏపీ ఎడ్‌సెట్‌, 8 నుంచి 11 వరకు ఏపీ ఈఏపీసెట్‌ (ఇంజినీరింగ్‌), 19 నుంచి 20వ తేదీ వరకు ఏపీ ఈఏపీసెట్‌ (అగ్రికల్చర్‌, ఫార్మసీ) జరగనున్నవి. పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్‌ 163 అమలు చేయాలని, విద్యార్థులకు తాగునీరు, పారిశుద్ధ్యం, నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరీక్ష కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆరు కేంద్రాల్లో నీట్‌

జిల్లాలోని ఆరు కేంద్రాల్లో ఈనెల 3న నీట్‌ పరీక్ష నిర్వహించనున్నట్టు డీఆర్వో సీహెచ్‌ సత్తిబాబు తెలిపారు. పరీక్షకు పక్కాఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. పరీక్ష కేంద్రంలోకి కేవలం రైటింగ్‌ ప్యాడ్‌, ఐడీ ప్రూఫ్‌, పారదర్శక నీటి బాటిల్‌ మాత్రమే తీసుకురావాలన్నారు. సమావేశంలో విద్యుత్‌శాఖ ఎస్‌ఈ లక్ష్మణరావు, డీఈఓ మాణిక్యంనాయుడు, ప్రజా రవాణాఅధికారి జి.వరలక్ష్మి, కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ దిలీప్‌ మోదీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement