విజయనగరం ఫోర్ట్: అగ్నిగోళాన్ని తలపించేలా ఎండలు ఉన్నాయి. దీంతో ఇళ్లలోసైతం ఉండలేని పరిస్థితి. పొట్టకూటి కోసం ఎండతీవ్రతను సైతం భరిస్తూ ఉపాధి హామీ వేతనదారులు పనిచేస్తున్నారు. అయితే ఉపాధి హామీ వేతనదారులకు రక్షణ కల్పించడంలో టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎండవేడమి నుంచి ఉపశమనం పొందేందుకు అవసరమైన టెంట్లు సరఫరా చేయకుండా టీడీపీ సర్కార్ అలసత్వం వహించడం పట్ల వేతనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భానుడి ప్రతాపం ఎక్కువగా ఉండడం వల్ల ఉపాధి హామీ వేతనదారులు అల్లాడుతున్నారు.
డ్వామా అధికారుల ఉచిత సలహా
ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులకు ప్రభుత్వం నీడనిచ్చే టెంట్లు సరఫరా చేయలేదు. ఎవరి టెంట్లు వారే వేసుకోవాలని డ్వామా అధికారులు ఉచిత సలహా ఇస్తున్నారు. దీంతో గత్యంతరం లేక వేతనదారులు తాటి, కొబ్బరి కమ్మలతో టెంట్లు వేసుకుంటున్నారు. అయితే అవి వారికి పెద్దగా రక్షణ ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టెంటు నీడలో కాసేపు విశ్రాంతి
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసే వేతనదారులు ఎటువంటి నీడలేని చెరువులు, కాలువులు వంటి ప్రదేశాల్లో పనిచేస్తారు. ఎండలో పనిచేయడం వల్ల త్వరగా అలసట చెందుతారు. అటువంటి వారికి కాసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం టెంట్లు అవసరం. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత వేతనదారులు పనులు చేయడానికి మళ్లీ వెళ్లుంటారు. అంతేకాకుండా టెంట్ల కింద మంచినీరు కూడా పెడతారు. అంతటి అత్యవసరమైన టెంట్లు సరఫరా చేయకుండా టీడీపీ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
వడదెబ్బతో ఉపాధి వేతనదారు మృతి
గంట్యాడ మండలం కొత్త వెలగాడ గ్రామంలో అదేగ్రామానికి చెందిన చౌడువాడ కన్నయ్యతాత అనే ఉపాధి వేతనదారు మంగళవారం చెరువులో పనిచేస్తూ ఎండ వేడమికి అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రికి తీసుకుని వెళ్లేందుకు సన్నద్ధయ్యేలోగా మృతిచెందాడు. అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్న ప్రస్తుతం తరుణంలో ఉపాధిహామీ వేతనదారులకు అన్ని విధాలా రక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
విశ్రాంతి లేకుండా పనులు
గతంలో ఉపాధి హామీ వేతనదారులకు వారంలో ఒక రోజు సెలవు ఉండేది. సోమవారం నుంచి శనివారం వరకు పనులు పెడితే ఆదివారం సెలవు ఉండేది. అయితే టీడీపీ సర్కార్ వేతనదారులకు ఒక్క రోజు కూడ విశ్రాంతి లేకుండా ఆదివారం కూడా పనులు పెడుతోంది. ఇది కూడా వేతనదారులకు కాస్త ఇబ్బంది కరమైన పరిస్థితే. జిల్లాలో సగటున రోజుకు 1.50 లక్షల మంది వరకు వేతనదారులు పనికి వెళ్తున్నారు.
ఓఆర్‌ఎస్ వినియోగంపై అవగాహన కరువు
వడదెబ్బకు గురికాకుండా రక్షణ ఇచ్చే ఓఆర్‌ఎస్ ద్రావణం ఏవిధంగా వినియోగించుకోవాలి అన్నదానిపై వేతనదారులకు అవగాహన కల్పించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పెడుతున్నారు. కానీ ఆ ద్రావణం ఏవిధంగా నీళ్లలో కలిపి తాగాలి అనే దానిపై అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్ని చోట్ల ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు కూడా అందించడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేతనదారులకు టెంట్లు సరఫరా చేయని టీడీపీ సర్కార్
తాటి, కొబ్బరి కమ్మలతో వేసుకుంటున్న వేతనదారులు
వేతనదారులకు రక్షణ ఇవ్వడం లేదనే ఆరోపణలు
గంట్యాడ మండలంలో పనిచేస్తూ
ఓ వేతనదారు మృతి
వేతనదారులే టెంట్లు వేసుకోవాలి
ప్రభుత్వం నుంచి టెంట్లు సరఫరా లేదు. వేతనదారులే వారికి అవసరమైన టెంట్లు ఏర్పాటు చేసుకోవాలి. వైద్యసిబ్బంది ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు వేతనదారులకు అందిస్తున్నారు.
– ఎస్.శారదదేవి, పీడీ, డ్వామా


