వేపాడ: మండలంలోని కొండగంగుబూడి పంచాయతీ ఎస్.కె.ఎస్.ఆర్.పురానికి చెందిన జగన్నాథసాగర్ పక్కన ఉన్న మామిడి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో తోట కాలిపోతుండడాన్ని గుర్తించిన పరవాడ జగదీష్ తక్షణమే వాటర్ ట్యాంక్‌తో నీరు తీసుకెళ్లి లగుడు అప్పలకొండ సహాయంతో మంటలను అదుపుచేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో పెద్దనష్టం జరగకుండా కాపాడుకోగలిగామని స్థానికులు చెబుతున్నారు.
కంచిరెడ్డి పాలెంలో జీడితోట
బొండపల్లి: మండంలోని కంచిరెడ్డి పాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 10 ఎకరాల్లో జీడితోట దగ్ధమైనట్లు గజపతినగరం అగ్నిమాపక కేంద్రం అధికారి ఎంఎస్‌వీ.రవిప్రసాద్ తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బర్ల లక్ష్మమ్మ జీడితోటలో మంటలు చేలరేగి క్రమంగా పక్కనే ఉన్న తోటలకు వ్యాపించి 10 ఎకరాల్లో చెట్లు కాలిపోయినట్లు తెలిపారు. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని మాపక వాహనంతో వెళ్లి మంటలు చుట్టుపక్కల ఉన్న తోటలకు అంటుకోకుండా అర్పివేసినట్లు చెప్పారు.
మహిళా రోగి పట్ల
అసభ్యకర ప్రవర్తన
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఓ మహిళా రోగి పట్ల శానిటేషన్ వర్కర్ (మేల్) అసభ్యకరంగా ప్రవర్తించినట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల20 వతేదీన ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ ఒకరు రోగికి సహాయం చేస్తానని చెప్పి ఆమె పట్ల అసభ్యకరంగా వ్యవహరించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సిబ్బంది తెలిపారు. ఇదేవిషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ వద్ద సాక్షి ప్రస్తావించగా ఓ మహిళా రోగి పట్ల మేల్ శానిటేషన్ వర్కర్ అసభ్యకరంగా ప్రవర్తించినట్టు తెలిసిందని, వెంటనే శానిటేషన్ సూపర్ వైజర్‌ను పిలిపించి వర్కర్‌ను అక్కడి నుంచి మార్చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
అనుచిత పోస్టులు పెడితే కఠిన చర్యలు
విజయనగరం క్రైమ్ : సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ బుధవారం హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎలాంటి అనుచితమైన పోస్టులు పెట్టినా, విద్వేషాలు రెచ్చగొట్టే వారిపైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మరో మారు హెచ్చరించారు. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్, టెలిగ్రాం, వాట్సాప్, లింకిడిన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్‌మ్స్ లో ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెట్టి మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై జిల్లా పోలీసు శాఖ ప్రత్యేకం నిఘా పెట్టిందన్నారు. ఒక బృందాన్ని ప్రత్యేకంగా నియమించి, సోషల్ మీడియాలో వచ్చే పోస్టులను నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తుల వివరాలను రాబట్టి, వారికి నోటీసులు జారీ చేస్తామన్నారు. కుటుంబ సభ్యుల సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు సీజ్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నామని ఇతరులతో గుర్తింపు పొందేందుకు విద్వేషాలు రెచ్చగొడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపైనా, వారిని ప్రోత్సహించే వారిపైనా చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ప్రజలను హెచ్చరించారు.


