బెర్రీ కంపెనీలో కార్మికుడి మృతి | - | Sakshi
Sakshi News home page

బెర్రీ కంపెనీలో కార్మికుడి మృతి

Apr 23 2026 7:18 AM | Updated on Apr 23 2026 7:18 AM

బెర్రీ కంపెనీలో కార్మికుడి మృతి

బొబ్బిలి: పట్టణ పరిధిలోని బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్‌ కంపెనీలో డైలీ లేబర్‌గా పనిచేస్తున్న కొరికాని కృష్ణ(40)కంపెనీలో విధులు నిర్వహిస్తూ అనారోగ్యంతో ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేరి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. సంతకవిటి మండలం కొండగూడెం గ్రామానికి చెందిన కృష్ణ పండగ నిమిత్తం స్వగ్రామం వెళ్లాడు. తిరిగి వచ్చాక మంగళవారం రాత్రి విధుల్లో చేరాడు. విధులు నిర్వర్తిస్తుండగా ఆకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లగా కార్మికులు, తండ్రి పెంటయ్య,బంధువు స్వామినాయుడులు స్థానిక అభయ ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతి చెందిన కృష్ణకు భార్య, పెళ్లీడుకొచ్చిన ఇద్దరు కుమార్తెలున్నారు.

రూ.50లక్షల పరిహారమివ్వాలి

గ్రోత్‌ సెంటర్‌లోని బెర్రీ పరిశ్రమలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, గతంలో ఈ కంపెనీలో పనిచేసిన వారు ఎంతోమంది అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటనలున్నాయని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పొట్నూరు శంకర రావు, నాయకులు సింగిరెడ్డి గోపాలం, బల శ్రీనులు అన్నారు. బుధవారం స్థానిక అభయ ఆస్పత్రిలో కృష్ణ మృతదేహం వద్ద వారు మాట్లాడుతూ ఇద్దరు ఆడపిల్లలున్న మృతుడి కుటుంబానికి రూ.50లక్షల పరిహారమివ్వాలని డిమాండ్‌ చేశారు. కంపెనీలో కార్మికులకు తాగేందుకు నీరు, రక్షణ పరికరాలు, రెస్ట్‌ హాలు లేవన్నారు. కంపెనీలన్నీ ఒకటై కార్మికుల కడుపు కొడుతున్నాయని విమర్శించారు. స్థానికులకు ఉద్యోగాలివ్వకుండా ఇతర ప్రాంతాల నుంచి కార్మికులను తీసుకువస్తున్నారన్నారు. వారితో రోజుకు 12 గంటలు పనిచేయించుకుంటున్నారని ఆరోపించారు. లేబర్‌ అధికారులు, ఫ్యాక్టరీ ఇన్‌స్పెక్టర్లు తనిఖీలు చేయడం లేదని, దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మృతి చెందిన కార్మికుడికి రూ.50లక్షల పరిహారమివ్వాల్సిందేనని పట్టుబట్టారు.

చికిత్స పొందుతూ యువకుడు..

భామిని: మండలంలోని సతివాడకు చెందిన యువకుడు పొట్నూరు మనోజ్‌ కుమార్‌(24) బుధవారం విశాఖ కేజీహెచ్‌లో వైద్య సేవలు పొందుతూ మృతి చెందాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనోజ్‌ కుమార్‌ ఒంటిపై పెట్రోలు పోసుకుని కాల్చుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.కాలిన మంటలతో వీధిలో పరుగెడుతున్న మనోజ్‌కుమార్‌ను స్థానికులు వీధిలోని పెంటగుమ్మిలో తోసి ప్రమాదం నుంచి రక్షించారు. వెంటనే కొత్తూరు ప్రభుత్వాస్పత్రికి అనంతం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించగా వైద్యసేవలు పొందుతూ మృత్యువాత పడినట్లు పోలీసులు తెలిపారు. మనోజ్‌కుమార్‌కు మతిస్థిమితం లేక పోవడంతో ఈ దుర్ఘటన జరిగిందని మృతుడి తల్లిదండ్రులు తెలిపారు. బత్తిలి ఎస్సై రవీంద్ర ఆధ్వర్యంలో హెచ్‌సీ సంగమేస్‌ కేసు నమోదు చేసి కేజీహెచ్‌కు వెళ్లి పోస్టుమార్టం నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement