విజయనగరం అర్బన్: జిల్లాలో జనవరి నెల నుంచి ప్రణాళికాబద్ధంగా కొనసాగుతున్న రీ సర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఆయన కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్‌డీఓలు, తహసీల్దార్లు, సర్వే సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. రూపొందించిన ప్రణాళిక ప్రకారం మ్యుటేషన్లు, సబ్‌డివిజన్లు, రైతు ముంగిటకే 1 బీ పంపిణీ, పాస్ పుస్తకాల ముద్రణ వంటి ప్రక్రియలను క్రమబద్ధంగా పూర్తి చేయాలని సూచించారు. మండల, గ్రామాల వారీగా రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. సర్వే పూర్తయ్యాక సర్టిఫికెట్ అందడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో సర్వే అనంతరం తప్పనిసరిగా సర్టిఫికెట్ అందించాలని స్పష్టం చేశా రు. వంటగ్యాస్ సరఫరాలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారనే అరోపణలపై గ్యాస్ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని సివిల్ సప్‌లైస్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ మాట్లాడుతూ ఇప్పటికే పంపణీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకాలలోని తప్పులను సరిదిద్ది, మ్యుటేషన్లు, సబ్‌డివిజన్లు, ఫారం–8, జాయింట్ ఎల్‌బీఎం సమస్యలను పరిష్కరించి జూన్ నాటికి తప్పుల్లేని పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఐదు విడతలుగా చేపట్టిన రీ సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, 2027 మార్చి నాటికి మొత్తం సర్వే పూర్తి చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ సీహెచ్ సత్తిబాబు, ఆర్‌డీఓలు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి


