వేపాడ: అధికార దుధుర్వినియోగానికి పాల్ప డుతూ, రాజకీయాలకు వత్తాసు పలుకుతున్న పంచాయతీ కార్యదర్శిపై ఎట్టకేలకు వేటు పడింది. కార్యదర్శిపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించిన కలెక్టర్ రాంసుందర్‌రెడ్డి ఆరోపణలు వాస్తవాలు అని తేలడంతో కార్యదర్శి సస్పెన్షన్‌కు ఆదేశాలు జారీచేశారు. వేపాడ మండలంలోని బానాది పంచాయతీ కార్యదర్శి ఏఎస్‌ఎస్‌ఎన్ మూర్తి సస్పెన్షన్ ఉత్తర్వులు మంగళవారమే స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి అందినా ఎంపీడీవో మాత్రం విషయం బయట పెట్టకపోవటం విశేషం. వేపాడ మండలంలో బానాది పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏఎస్‌ఎస్‌ఎన్ మూర్తి తీరు వివాదాస్పదమైంది. సకాలంలో గ్రామసభలు జరపకపోవడంవ, విధుల పట్ల నిర్లక్ష్యం, బాధ్యతగా వ్యవహరించకపోడడం, పారిశుధ్యపనులు నిర్వహించకపోవడం, రికార్డులు తారుమారు చేయడం, పంచాయతీ రికార్డులు తన ఇంటికి తీసుకుపోవడం, మహిళా సర్పంచ్ పట్ల దురుసుగా వ్యవహరించడం వంటి పలు అంశాలపై సర్పంచ్ కర్రి యశోద జిల్లా అధికారులు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాలతో మార్చి 20న డీఎల్‌పీఓ విచారణ నిర్వహించి, నివేదికను జిల్లా అధికారులకు అందజేయడంతో స్పందించిన కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీఓ సీహెచ్ సూర్యనారాయణ తెలిపారు.


