● బ్యారెక్స్‌లో పీఎస్‌ఓల ట్రైనింగ్ క్యాంప్
బొబ్బిలి/విజయనగరం క్రైమ్: ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్లే భవానీపట్నం ఎక్స్‌ప్రెస్‌లో బొబ్బిలి డీఎస్పీ ఆర్.గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అన్ని బోగీలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. స్థానిక ఏపీ పోలీసులతో పాటు జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, ఈగిల్, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఒక్కసారిగా రైలెక్కి చేపట్టిన తనిఖీలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేశాయి. తనిఖీల ఉద్దేశాన్ని ప్రయాణికులకు పోలీస్ అధికారులు వివరించారు. జిల్లావ్యాప్తంగా మద్యం, గంజాయి, పేలుడు పదార్థాలు, డ్రగ్స్, గుట్కాల అక్రమరవాణాను అడ్డుకునేందుకే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు. సహకరించాలని కోరారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా వారి బ్యాగులు, సూట్‌కేస్‌లు, పలువురు తీసుకువెళ్తున్న గోనె సంచులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సీఐ కె.నారాయణరావుతో పాటు రామభద్రపురం, తెర్లాం, మానాపురం ఎస్సైలు జ్ఞానప్రసాద్, సాగర్‌బాబు, జయంతి, జీఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ బాలాజీరావుతో పాటు వివిధ పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.
వీఐపీల భద్రతలో అలెర్ట్ ముఖ్యం
విజయనగరం క్రైమ్: వీఐపీల భద్రత విషయంలో పోలీస్ శాఖ రాజీ పడే ప్రసక్తే లేదని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. వీవీఐపీల భద్రతలో సిబ్బందికి అలెర్ట్ అత్యంత ఆవశ్యకమన్నారు. ఈమేరకు డీపీఓలోని బ్యారెక్స్ మైదానంలో పీఎస్‌ఓల రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా హాజరైన ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ వ్యక్తిగత భద్రత విధులు (పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్) నిర్వహించే పోలీసు సిబ్బంది (పీఎస్‌ఓలు) తమ విధులు నిర్వహించే సమయంలో నిరంతరం అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. భద్రత విధుల నిర్వహణలో సిబ్బందికి శారీరక దారుఢ్యం, వృత్తి నైపుణ్యం వారిని ఉత్తమంగా నిలుపుతాయన్నారు. ఈ శిక్షణలో పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం పెంపొందించేందుకు, వీఐపీ సెక్యూరిటీలో నిర్వహించాల్సిన విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైరింగ్ ప్రాక్టీస్, వీఐపీ భద్రత విధుల నిర్వహణలో ఏం చేయాలి, ఏంచేయకూడదన్న అంశాలు, బాంబ్ డిస్పోజల్ విధుల పట్ల పునశ్చరణ తరగతులను రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పునశ్చరణ తరగతులను వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది సద్వినియోగం చేసుకుని, తమ వృత్తి నైపుణ్యాన్ని, శారీరక సామర్థ్యాన్ని మెరుగుపర్చుకోవా లని సూచించారు. పీఎస్‌ఓ విధులు ఎక్కడ, ఎవరి వద్ద నిర్వహించినా క్రమశిక్షణతో మెలగాలని, నీట్ యూనిఫాం, చక్కని శారీరక దారుఢ్యంతో కనిపించాలని, విధుల నిర్వహణలో చురుగ్గా వ్యవహరిస్తూ, వీఐపీ భద్రతకు ప్రాధాన్యతను కల్పించాలన్నారు. ముఖ్య వ్యక్తుల భద్రత నిర్వహించే పీఎస్‌ఓలు చెడు వ్యసనాలకు దూరంగా, మంచి నడవడికతో ఉండాలని తద్వారా జిల్లా పోలీసుశాఖ ప్రతిష్టను పెంచాలని హితవు పలికారు. శిక్షణ కార్యక్రమంలో సెక్యూరిటీ ఆర్‌ఐ పి.శ్రీనివాసరావు, అడ్మిన్ ఆర్‌ఐ ఎన్.గోపాల నాయుడు, ఎంటి ఆర్‌ఐ ఆర్.రమేష్ కుమార్, ఆర్‌ఎస్సై ముబారక్ అలీ వ్యక్తిగత భద్రత విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది (పీఎస్‌ఓలు) పాల్గొన్నారు.
నియామక పత్రాలు అందజేత
విజయనగరం రూరల్:
స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉద్యోగులకు ఉద్యోగోన్నతి, నిరుద్యోగులకు కారుణ్య నియామక పత్రాలను జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మంగళవారం తన కార్యాలయంలో అందజేశారు. సింగన్నపాలెంలో సెకెండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ స్వామిబాబు మృతిచెందడంతో ఆయన భార్య ఎస్.రమాదేవిని చీపురుపల్లి ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో ఓఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు.
జెడ్పీలో జూనియర్ సహాయకులుగా పనిచేస్తున్న 9 మందితో పాటు, ముగ్గురు టైపిస్టులకు సీనియర్ సహాయకులుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, ఎస్టాబ్లిష్‌మెంట్ ఏఓ ఎన్.రాజేశ్వరి పాల్గొన్నారు.


