వలస కార్మికుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ | - | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌

Apr 22 2026 8:00 AM | Updated on Apr 22 2026 8:00 AM

విజయనగరం గంటస్తంభం: అంతర్‌రాష్ట్ర వలస కార్మికులు తమ సమస్యలను నేరుగా అధికారులకు ఫిర్యాదు చేసేందుకు విజయవాడలో 24 గంటల పాటు పనిచేసే టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు విజయనగరం కార్మికశాఖ ఉప కమిషనర్‌ ఎస్‌డీవీ ప్రసాదరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. వలస కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం 1800–425–8587 నంబర్‌కు ఎప్పుడైనా ఫోన్‌ చేయవచ్చని పేర్కొన్నారు. కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించే ఉద్దేశంతో కార్మికశాఖ ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిందని వివరించారు.

మృత్యు‘ధార’..

శృంగవరపుకోట: మృత్యువు ఏ రూపంలో.. ఎవరిని ఎలా కాటేస్తోందో తెలియదు. దీనికి ఎస్‌.కోటలో మంగళవారం జరిగిన విద్యుత్‌ ప్రమాదమే నిలువెత్తునిదర్శనం. కొత్తూరు గ్రామానికి చెందిన కక్కల రాము (48) అదే గ్రామంలో బైక్‌ మెకానిక్‌ షాపులో పనిచేస్తున్నాడు. ఏళ్ల తరబడి చేస్తున్న అలవాటైన పని. ఎప్పటివలే బైక్‌కు వాటర్‌ సర్వీసింగ్‌ చేస్తున్న ప్రయత్నంలో గన్‌ను పైకిలేపాడు. అంతే.. నీటిధారపైన ఉన్న విద్యుత్‌ లైన్‌ను తాకింది. దానిగుండా విద్యుత్‌ ప్రవహించడంతో వెంటనే రాము షాక్‌కు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కొనఊపిరితో ఉన్న రామును ఎస్‌.కోటలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌.కోట సీఐ నారాయణమూర్తి తెలిపారు. మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో ఒక కుమార్తె, కుమారునికి వివాహాలు అయ్యాయి. బైక్‌ సర్వీసింగ్‌ కార్మికుడి మృతితో కొత్తూరులో విషాదం అలుముకుంది.

విద్యుత్‌ షాక్‌తో హోటల్‌ యజమాని మృతి

పూసపాటిరేగ: మండలంలోని కందివలస సమీపంలో దేవి హోటల్‌ నిర్వహిస్తున్న చిక్కాల అనిల్‌కుమార్‌(29) విద్యుత్‌షాక్‌తో దుర్మరణం చెందాడు. హోటల్‌ వెనకభాగంలో నీటిపైపుతో ఇంటిని శుభ్రం చేస్తుండగా షాక్‌ తగిలి అపస్మారక స్థితిలో చేరుకున్నాడు. ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. ఆయనకు భార్య అనురాధ ఉన్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం సుందరపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూసపాటిరేగ ఎస్‌ఐ ఐ.దుర్గాప్రసాద్‌ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సీహెచ్‌సీ సేవలపై ఆరా

బాడంగి: బాడంగి సీహెచ్‌సీని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీహెచ్‌సీలో వైద్యసేవలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. ఆస్పత్రి ముందు వర్షపునీరు నిల్వ ఉన్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎంపీడీఓకు ఫోన్‌చేసి నీరు నిల్వలేకుండా చూడాలన్నారు. ఆస్పత్రి భవన నిర్వాణాలు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట ఏపీఎంఐడీసీ డీఈఈ నరేంద్ర, తహసీల్దార్‌ వరప్రసాద్‌, సూపరింటెండెంట్‌ డాక్ట్టర్‌ నాగేశ్వరరావు, జెడ్పీటీసీ పెద్దింటి రామారావు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement