విజయనగరం అర్బన్:
రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట పీఆర్టీయూ మంగళవారం ఆందోళన చేసింది. సమస్యలు పరిష్కరించాలంటూ నినదించింది. ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక సర్వీస్ రూల్స్ ఏర్పాటు చేయాలని, పీఆర్‌సీ కమిటీని ఏర్పాటుచేయాలని, సీపీఎస్‌ను రద్దుచేసి పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాతపెన్షన్ వర్తింపజేయాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ, ఎర్నల్‌లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అంశాలను అమలు చేయాలని కోరారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల నియామకం చేపట్టాలని సూచించారు. జెడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలను కలెక్టర్ పరిధిలో నిర్వహించాలని, జీఓ 302ను పునరుద్ధరించి జూనియర్ లెక్చరర్లకు పదోన్నతులు కల్పించాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ ఖాతాలు ప్రారంభించాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, టెట్ పరీక్షను రద్దు చేయాలన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకులాలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఆయా సంస్థల్లో సిబ్బంది నియామకాలు చేపట్టాలని కోరారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులనాయుడు, ఏపీటీఎఫ్ నాయకులు ఈశ్వరరావు, ఏపీయూఎస్ నాయకులు బల్ల శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వి.రవీంధ్రనాయుడు, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రావాడ రాంబాబు, ఇందుకూరు అశోక్‌రాజు, బంకపల్ల శివప్రసాద్, శంకర్‌నాయుడు, రెడ్డి గణపతి, పైడిరాజు, డెక్క వెంకటరావు, చిట్టి రామునాయుడు, రావాడ రామకృష్ణ, మెహన్‌రాజ్, జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


