విజయనగరం గంటస్తంభం:
రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ప్రశ్నార్థకంగా మారుతోంది. సాక్షి పత్రిక చిత్తూరు జిల్లా సీనియర్ జర్నలిస్ట్ పూడి శ్రీహరి అరెస్టు తీరు ప్రజాస్వామ్యవాదులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వం తన వైఫల్యాలను ప్రశ్నించే గొంతుకలను నొక్కేయాలని చూడడం అత్యంత దుర్మార్గమని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణంలోని గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టు యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ప్రదర్మన నిర్వహించాయి.
● ఇదెక్కడి అన్యాయం...
అరెస్టుల విషయంలో అత్యున్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులను పోలీసులు పూర్తిగా విస్మరించారని జర్నలిస్టు సంఘాల నాయకులు ధ్వజమెత్తారు.
ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే కేసుల్లో నిందితులకు ముందస్తుగా సెక్షన్ 41–ఏ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉండగా, శ్రీహరి విషయంలో నేరుగా అరెస్టు చేయడం పోలీసుల అతిగా ప్రవర్తించడమేనని విమర్మించారు. అరెస్టు సమయంలో పోలీసులు యూనిఫాంలో ఉండాలని, స్పష్టమైన ఐడెంటిటీ కార్డులు కలిగి ఉండాలన్న నిబంధనలను గాలికొదిలేశారని, డీకే బసు మార్గదర్మకాలకు తూట్లుపొడిచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
● ప్రభుత్వ కక్షసాధింపు చర్యే...
ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వం కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే జర్నలిస్టులపై కక్ష కట్టిందని నేతలు ఆరోపించారు. కేవలం వార్తలు రాసినందుకు దేశద్రోహం, 153ఏ వంటి తీవ్రమైన సెక్షన్లు బనాయించడం భావప్రకటన స్వేచ్ఛను ఖూనీ చేయడమేనన్నారు. నిరసన కార్యక్రమంలో సాక్షి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధి యుగంధర్, చిన్న పత్రికల అసోసియేషన్ అధ్యక్షుడు కె.జె.శర్మ, ఏపీడబ్ల్యూజే ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రమేష్‌నాయుడు, ఏపీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్మి ఎం.ఎస్.రాజు, వారితో పాటు పాత్రికేయులు వి.ఎం.ఎల్.లక్ష్మణరావు, డేవిడ్‌రాజు, ఉమెన్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యురాలు దేవి, తదితరులు పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులు ఆపాలి
జర్నలిస్టుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం రాజ్యాంగ విరుద్ధం. శ్రీహరి అరెస్టులో నిబంధనలు పాటించని అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమంగా బనాయించిన కేసులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి.
– పి.ఎస్.ఎస్.వి.శివప్రసాద్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ, ఏపీడబ్ల్యూజే
పోలీస్ వ్యవస్థ చట్టబద్ధంగా నడుచుకోవాలి
పోలీసులు ఒక పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించడం దారుణం. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకోకపోతే న్యాయపోరాటం చేస్తాం. జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉంది. – వి.ఎం.మహాపాత్రో,
ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు
నిరంకుశత్వానికి పరాకాష్ట
జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తాయి. ప్రశ్నించే గొంతుకలను అరెస్టులతో భయపెట్టలేరు. ప్రభుత్వం తన పద్ధతి మార్చకోవాలి. – ఎంఎంఎల్ నాయుడు,
10టీవీ, సీనియర్ రిపోర్టర్
చట్టాన్ని గౌరవించాలి..
సీనియర్ జర్నలిస్టు పూడి శ్రీహరి అరెస్టు విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్మకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి. చట్టాన్ని పక్కనపెట్టి వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి హానికరం. మహిళా జర్నలిస్టులపై కూడా నిరాధార కేసులు నమోదు చేయడం ఆందోళనకరం. ఇటువంటి చర్యలు వెంటనే నిలిపివేసి, ప్రజల కోసం పనిచేసే పాలన కొనసాగాలి.
– విజయలక్ష్మి, జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ ఉమెన్ జర్నలిస్టు అసోసియేషన్
పూడి శ్రీహరి అరెస్టు
రాజ్యాంగ విరుద్ధం
అక్రమ అరెస్టుపై భగ్గుమన్న
జర్నలిస్టు లోకం
సుప్రీంకోర్టు మార్గదర్మకాలకు పాతర
ఖాకీల అత్యుత్సాహంపై ఆగ్రహం
విజయనగరం కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన
కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత


