● సోమవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
● ఎండ వేడమితో విలవిల
● మధ్యాహ్నం 12 గంటలకే ఖాళీ అయిన రోడ్లు
విజయనగరం ఆర్‌అండ్‌ఆర్ రైతు బజార్ రోడ్డులో పండ్లు వదిలేసి నీడకు వెళ్లిపోయిన చిరు వ్యాపారులు
విజయనగరం ఫోర్ట్: భానుడు భగ్గుమన్నాడు. జనంపై నిప్పుల వర్షం కురిపించాడు. ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ ఏడాదిలో అధ్యధికంగా సోమవారం 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం అపసోపాలు పడ్డారు. ఇటుకబట్టీలు, ఫుట్‌పాత్ వ్యాపారులు, ఉపాధి హామీ వేతనదారులు, కర్రలు కొట్టేవారు, కళాసీలు ఎండ వేడమికి తాళలేక ఉదయం 10 గంటలకే ఇళ్లకు వచ్చేశారు. పుట్‌పాత్‌లు, రోడ్డు పక్కన కూరగాయలు, పండ్లు అమ్ముకునేవారు ఎండ వేడమికి తాళలేక నీడకు వెళ్లి పోయారు. మధ్యాహ్నం 12 గంటలకు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. వృద్ధులు, పిల్లలు, చర్మసంబంధిత వ్యాధిగ్రస్తులు ఎండ ధాటికి తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం కొబ్బరి బొండాలు, పండ్ల రసాలు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ను తాగారు.
ఎండలో తిరగరాదు
ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఎండలో తిరగడం, ప్రయాణించడం మంచిదికాదు. సాధ్యమైనంతవరకు 10 గంటల లోగా పనులు ముగించుకోవాలి. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు మంచినీళ్లు తాగాలి. – డాక్టర్ ఎస్.జీవనరాణి,
డీఎంహెచ్‌ఓ


