● డీఎస్పీ గోవిందరావు
బొబ్బిలి: పట్టణంలో ఈ నెల 28న జరిగే దాడితల్లి, సరేపోలమ్మ అమ్మవార్ల జోడు సిరిమానోత్సవాలను భక్తులు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీఎస్పీ ఆర్ గోవిందరావు సూచించారు. పాత బొబ్బిలిలోని ధర్మకర్త చోడిగంజి రమేష్‌నాయుడు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, భక్తులతో సోమవారం రాత్రి సిరిమానోత్సవ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. సిరిమాను తిరిగే ప్రాంతాల్లో రహదారులు పరిశుభ్రంగా ఉండాలన్నారు. అల్లర్లు చేసే వారిపై దృష్టి సారించాలని సీఐ కె.నారాయణరావుకు సూచించారు. గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పోలీసులకు సహకరించాలన్నారు. కౌన్సిలర్ కోట పెదరాములు, నాయకులు మింది రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడదాం
విజయనగరం గంటస్తంభం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మికవ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికులంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ వెంకటసుబ్బయ్య పిలుపునిచ్చారు. విజయనగరంలో సోమవారం నిర్వహించిన ఏఐటీయూసీ 12వ జిల్లా మహాసభలు భారీ ప్రదర్మనతో ప్రారంభమయ్యాయి. పట్టణంలోని స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వరకు ఎర్రజెండాలతో కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ... కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే కేంద్రం 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్‌లుగా కుదించిందని విమర్మించారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చడం దారుణమన్నారు. ఈ నెల 26 నుంచి తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభలను జయపద్రం చేయాలని కోరారు. సీపీఐ నేతలు పి.కామేశ్వరరావు, ఓమ్మి రమణ మాట్లాడుతూ, ఏఐటీయూసీ 106 ఏళ్లుగా కార్మికుల పక్షాన పోరాడుతోందని, వారికి ఎల్లప్పుడూ సీపీఐ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా నేతలు బుగత అశోక్, పడాల రమణ, కె.స్రవంతి, తదితరులు పాల్గొన్నారు.


