యావన్మందికీ తెలియజేయునది ఏమనగా... | - | Sakshi
Sakshi News home page

యావన్మందికీ తెలియజేయునది ఏమనగా...

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

27న పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం

28 నుంచి చదురుగుడిలో అమ్మవారి దర్శనం

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం చాటింపు ప్రక్రియ సోమవారం సాయంత్రం ఆలయం వద్ద నిర్వహించారు. ఆలయ తలయారులు రామవరపు చినపైడిరాజు బృందం అమ్మవారికి మనవి చెప్పి, ఈ నెల 27న సోమవారం దేవరమహోత్సవం నిర్వహిస్తారని, 28న మంగళవారం నుంచి అమ్మవారు చదురుగుడిలో భక్తులకు దర్శనమిస్తారంటూ చాటింపు వేశారు. అనంతరం ఆలయ ఈఓ కె.శిరీష మాట్లాడుతూ 27న సాయంత్రం 4 గంటలకు అమ్మవారికి వనంగుడిలో పంచామృతాలతో అభిషేకాలు, స్తపన కార్యక్రమాలు అనంతరం ప్రత్యేక అలంకరణ ఉంటుందన్నారు. వేదపండితుల వేదస్వస్తి అనంతరం విచిత్రవేషధారణలు, భాజాభజంత్రీలతో అమ్మవారిని గాడీఖానా, సీఎంఆర్‌ కూడలి, ఎన్‌సీఎస్‌ రోడ్డు, గంటస్తంభం మీదుగా హుకుంపేటకు తీసుకెళ్తామన్నారు. రాత్రి 10 గంటలకు హుకుంపేటలో ఉన్న అమ్మవారి చదురుగుడి వద్ద ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. 28న మంగళవారం ఉదయం 6 గంటలకు అమ్మవారు పూజలందుకుంటారన్నారు. నాటి నుంచి ఉయ్యాల కంబాల వరకూ చదురుగుడిలోనే భక్తులకు దర్శనమిస్తారన్నారు. భక్తులందరూ అమ్మవారిని దర్శించి, తరించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement