పీజీఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ | - | Sakshi
Sakshi News home page

పీజీఆర్‌ఎస్‌కు వినతుల వెల్లువ

Apr 21 2026 6:13 AM | Updated on Apr 21 2026 6:13 AM

215 వినతుల స్వీకరణ

విజయనగరం అర్బన్‌: కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’(పీజీఆర్‌ఎస్‌), రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీదారులు హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు సమర్పించారు. కలెక్టర్‌ ఎం.రాంసుందర్‌రెడ్డి నేతృత్వంలో జిల్లా యంత్రాంగం వినతుల పరిష్కానికి ప్రత్యేక చర్యలు చేపడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు సత్వర పరిష్కారం అయ్యేలా కృషి చేస్నున్నారు. అర్జీదారుల సౌకర్యార్థం కలెక్టరేట్‌ వద్ద ప్రత్యేక రిసెప్షన్‌ కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు కూర్చుని సమస్యలు వివరించేందుకు కుర్చీలు ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి తాగునీరు వంటి వసతులు కల్పించారు. విభిన్న ప్రతిభావంతుల కోసం మూడు చక్రాల సైకిళ్ల ద్వారా లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మొత్తం 215 వినతులు స్వీకరించగా అందులో 89 రెవెన్యూ శాఖకు సంబంధించినవి ఉన్నాయి. పంచాయతీ రాజ్‌–24, మున్సిపల్‌–8, విద్యుత్‌–9, హౌసింగ్‌–2, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ–3, గ్రామ సచివాలయ శాఖ–2, విద్యాశాఖ–1 ఇతర శాఖలకు మరో 62 వినతులూ అందాయి. వినతుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని పెండింగ్‌ కేసులను వెంటనే డిస్పోజ్‌ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 1100 ద్వారా అందిన ఫిర్యాదులపై కూడా బాధ్యతగా స్పందించాలని సూచించారు,. ప్రతి వారం పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అర్జీదారులతో మాట్లాడిన వివరాలను రికార్డు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌, డీఆర్‌ఓ సీహెచ్‌.సత్తిబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

వినతుల పెండింగ్‌పై ప్రజల్లో అసంతృప్తి

పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌లకు పెద్ద ఎత్తున తరలివస్తున్న ప్రజల సమస్యల పరిష్కారం విషయంలో మాత్రం అసంతృప్తి కొనసాగుతోంది. జిల్లా నలుమూలల నుంచి వచ్చి అర్జీదారులు తమ వినతులు సమర్పించినప్పటికీ చాలా సమస్యలు వెంటనే పరిష్కారం కాలేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. భూ వివాదాలు, సర్వే సమస్యలు, పట్టాదారు పాస్‌ పుస్తకాల జాప్యం వంటి అంశాలు ఎక్కువగా రావడం, రెవెన్యూ వ్యవస్థలో లోపాలను వెలుగులోకి తెస్తున్నాయి. ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడం, అధికారులతో నేరుగా మాట్లాడే అవకాశం పరిమితంగా ఉండడం వంటి అంశాలపై అసంతృప్తి వ్యక్తమైంది.

అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి

పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి వచ్చిన వినతులను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకరరెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌, జేసీ సి.యశ్వంత్‌ కుమార్‌రెడ్డి, డీఆర్‌ఓ కె. హేమలత. ఎస్‌ఈసీ దిలీప్‌ చక్రవర్తి కలిసి 93 వినతులను స్వీకరించారు. ఇందులో రెవెన్యూకు సంబంధించి 24, ఇతర వినతులు 69 వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్దిష్ట గడువులోగా క్షేత్రస్థాయికి వెళ్లి సమస్యలను పరిష్కరించేలా అధికారులు చొరవ చూపాలని సూచించారు. ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను గుర్తించి వాటిపై సమగ్ర పరిశీలన చేసి పరిష్కారం చూపాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే అవసరమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 27 వినతులు

సీతంపేట: ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 27 వినతులు వచ్చాయి. ఐటీడీఏ ఏవో సునీల్‌ ఆధ్వర్యంలో అర్జీలు స్వీకరించారు. భామిని మండలం పాలవలస గ్రామానికి చెందిన కడ్రక గోపాలం, పీఎల్‌పురానికి చెందిన లక్ష్మీనారాయణలు పవర్‌ టిల్లర్‌ మంజూరు చేయాలని వినతిపత్రం సమర్పించారు. రాజమానుగూడ గ్రామానికి చెందిన సవర శివకుమార్‌ తాగునీటి ట్యాంకు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశాడు. కొత్తబర్న గ్రామానికి చెందిన ఆరిక వెంకటరావు రచ్చబండ నిర్మించాలని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఈవో నారాయుడు, వ్యవసాయాధికారి వాహిని, స్పోర్ట్స్‌ ఇన్‌చార్జ్‌ జాకాబ్‌ దయానంద్‌, డీఈ రాధారాణి, ఎ.డి శ్రీనివాసరావు, డీడీ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ అప్పారావు, జీసీడీవో రాములమ్మ ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement