● ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి పనులే కొత్తగా చేపట్టినట్లు జలహారతి
విజయనగరం ఫోర్ట్: ఓ సినిమాలో నటుడు చెల్లికి జరగాలి మళ్లీ మళ్లీ పెళ్లి అన్న విధంగా టీడీపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు తయారైందని పలువురు విమర్శిస్తున్నారు. కొత్తగా ఎటువంటి పనులు చేయకుండానే పాత పనులనే కొత్తగా చేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం కలరింగ్ ఇవ్వడం విస్తుగొలుపుతోంది. టీడీపీ వ్యవహారిశైలిని చూసిన వారంతా ఇదేం చోద్యం రా బాబు అని చర్చించుకుంటున్నారు. కొత్త పనులు చేపడితే డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది కావున పాతపనులనే కొత్తపనులుగా మమ అనిపించే విధంగా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల 6వతేదీన టీడీపీ సర్కార్ జలధార కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద జిల్లాలో ఉన్న గ్రామాల్లో చెరువుపనులు, నీరు చెట్టు వంటి పనులు చేపట్టాలి. తద్వారా భూగర్భ జలాల నీటిమట్టం పెంచాలన్నది కార్యక్రమం ఉద్దేశ్యం. అయితే జలధార పథకం కింద ఎలాంటి పనులు గుర్తించలేదని తెలిసింది. ప్రాథమిక కసరత్తు, పనుల గుర్తింపు వంటివి ఏవీ ఇంకా ప్రారంభం కాలేనట్లు తెలుస్తోంది.


