విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో క్లిష్టతరమైన శస్తత్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్ట ర్ అల్లు పద్మజ సోమవారం వెల్లడించారు. చీపురుపల్లి ప్రాంతానికి చెందిన రైతు పెంటమ్మ అనే వృద్ధురాలు కొద్ది రోజుల క్రితం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి కడుపు నొప్పితో వచ్చింది. జనరల్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ పీఏ రమణ, ఇతర వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు, స్కానింగ్ నిర్వహించి కడుపు లోపలి భాగంలో రెట్రోపెరిటోనియల్ ట్యూ మర్ ఉన్నట్లు నిర్ధారించారు. కడుపులో ఉన్న కణితిని రెట్రోపెరిటోనియల్ ప్రాంతంలో అన్ని వైపులా విస్తరించి, సమీపంలోని కిడ్నీ, ముఖ్యమైన రక్తనాళాలకు అంటుకుని ఉన్నట్లు గుర్తించారు. ఈ కణితి వల్ల రక్తనాళాలకు, ఇతర అవయవాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సుమారు 4 కిలోల కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించారు. కోలుకున్న తర్వాత డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించారు. ఈ శస్త్రచికిత్సలో డాక్టర్లు పీఏ రమణతో పాటు, చైతన్య బాబు, జగదీష్, వెంకటనాయుడు, ధర్మ కిషోర్, శశిధర్, అక్షిత, హేమసుందర్ నాయుడు పాల్గొన్నారు. వారిని సూపరింటెండెంట్ అభినందించారు.


