39.2 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం..
● వేల టన్నుల అపరాల దిగుబడి ● జిల్లాలో సుమారు 38,373 మెట్రిక్ టన్నుల దిగుబడి ● ప్రభుత్వం కొనుగోలు చేసింది 39 టన్నులు మాత్రమే.. ● దిగుబడుల్లో పది శాతం కూడా కొనుగోలు చేయని సర్కార్ ● తక్కువ ధరకే వ్యాపారులకు విక్రయించిన రైతులు
విజయనగరం ఫోర్ట్:
కొండను తవ్వి ఎలుకను పట్టిన సామెత మాదిరి తయారైంది టీడీపీ సర్కార్ పరిపాలన తీరు. రబీ సీజన్‌లో రైతులు పండించిన అపరాలు (పెసర, మినుము) కొనుగోలు చేసేందుకు టీడీపీ సర్కార్ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల తీరు ఇలానే ఉంది. జిల్లాలో పెసర, మినుము పంటల ఉత్పత్తి వేలాది టన్నులు వస్తే అందులో కనీసం 10 శాతం పంటను కూడా కొనుగోలు చేయలేదు. దీంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు ఒరిగిన ప్రయోజనం లేకుండా పోయింది. దీనికి తోడు పంటను రైతులు 60 నుంచి 70 శాతం విక్రయించుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీని వల్ల రైతులు తక్కువ ధరకే వ్యాపారులకు పంటను విక్రయించుకున్నారు.
ప్రభుత్వం కొనుగోలు చేసింది 39.2 మెట్రిక్ టన్నులే..
జిల్లాలో అపరాల దిగుబడులు ఆశించిన విధంగానే వచ్చాయి. మొత్తంగా 38,373 మెట్రిక్ టన్నుల దిగుబడులు వచ్చాయి. అయితే టీడీపీ సర్కార్ జిల్లాలో నాలుగు అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. జామి మండలం విజినిగిరి, సంతకవిటి, గజపతినగరం, బొబ్బిలిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో విజినిగిరి మినహా మిగిలిన ఎక్కడా ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. విజినిగిరి కొనుగోలు కేంద్రంలో 39.2 మెట్రిక్ టన్నులు మినుములు మాత్రమే కొనుగోలు చేశారు.
రైతులకు దక్కని మద్దతు
జిల్లాలో ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మద్దతు ధర కూడా లభించలేదు. అమావాస్య వెళ్లిన ఆరు నెలలు తర్వాత అల్లుడు వచ్చిన సామెత చందాన రైతులు పంట విక్రయించుకున్న తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. దీంతో రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రైతులు ఎంతో శ్రమించి ఆరుగాలం కష్టపడి పంటలు దిగుబడులు సాధిస్తుంటే ప్రభుత్వ తీరుతో నష్టాలే తప్ప లాభాల బాట పట్టలేకపోతున్నామన్న ఆవేదన రైతుల్లో నెలకొంది.
తక్కువ ధరకే..
అపరాలు (పెసర, మినుము) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో జాప్యం వల్ల వ్యాపారులు రైతుల నుంచి పంటను తక్కువ ధరకే కొనుగోలు చేశారు. ప్రభుత్వం మద్దతు ధర క్వింటాకు పెసలు రూ. 8,768, మినుములు క్వింటా మద్దతు ధర రూ. 7800గా నిర్ణయించింది. వ్యాపారులు మాత్రం క్వింటాకు పెసలు రూ.7 వేలు, మినుములు రూ. 6800లకు కొనుగోలు చేశారు. దీని వల్ల క్వింటాకు రైతులు పెసలకు రూ.1800, మినుములు రూ. 1000 వరకు నష్టపోయారు. మూడు నాలుగు క్వింటాళ్లు పండించిన రైతులు అయితే పెసలు రూ. 5400, మినుములు 3 వేల వరకు నష్టపోయారు. పంట చేతికి వచ్చిన ఆరంభ దశలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్టయితే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వచ్చేదని రైతులు చెబుతున్నారు.
పెసర, మినుము పంటలకు సంబంధించి జిల్లాలో నాలుగు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. జామి మండలం విజినిగిరి కొనుగోలు కేంద్రంలో మినుములు 39.2 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేశాం. మిగిలిన కేంద్రాల్లో కొనుగోలు జరగలేదు.
– ఎన్.వెంకటేశ్వరావు, జిల్లా మేనేజర్, మార్క్‌ఫెడ్


