ధరలు జిగేల్...కొనుగోళ్లు ఢమాల్ మందకొడిగా సాగుతున్న బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగిన ధరలతో కొనుగోలుకు సామాన్యుల దూరం
రూ. 2 లక్షలకు చేరువలో..
విజయనగరం:
శుభకార్యమైనా.. వివాహ వేడుకై నా పసిడి మెరవాల్సిందే.. వెండి మురవాల్సిందే. పేదింట్లో అయినా, కలవారి కుటుంబమైనా ఎవరి తాహతుకు తగ్గట్టు వారు బంగారం కొనుగోలు చేయడం సంప్రదాయం. ఇక పెళ్లిళ్ల సీజన్, అక్షయ తృతీయ రోజున పుత్తడికి గిరాకీ మరింత పెరుగుతుంది. అదే సమయంలో ధర ౖపైపెకి చేరుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా బంగారం, వెండి ధరలు పెరిగి సామాన్యులకు అందనంత ఎత్తుకు వెళ్లిపోతున్నాయి.
అక్షయ తృతీయ పర్వదినం
ఇక అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ధనిక.. పేద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం ధరలు రెట్టింపయ్యాయి. ఏటా సంప్రదాయంగా కొనుగోలు చేసేవారు ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో గతేడాదిలో కొన్న దానిలో సగమైనా తీసుకుందామని యోచిస్తున్నారు. కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దూరంగానే ఉంటున్నారు.
పెళ్లిళ్ల సీజన్ కావడంతో..
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడంతో పట్టణ ప్రాంతాల్లో వస్త్రాలు, ఇతర సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. గతంలో సామాన్యుల వివాహ వేడుకకు అన్ని ఖర్చులు కలిపి మొత్తంగా రూ.10 లక్షలలోపు పూర్తయ్యేది. ప్రస్తుతం అదే తరహాలో జరిపించడానికి రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు వెచ్చించాల్సి వస్తోంది. గడిచిన రెండు మూడేళ్లలో వ్యయం 60 శాతం పెరిగినట్లయింది. ఈ మోయలేని భారం వల్ల బంగారు ఆభరణాలకు దూరం చేస్తుంది.
ఈసారి అంతంతే...
ఉమ్మడి జిల్లాలో బంగారం వ్యాపారానికి విజయనగరం పెట్టింది పేరు. సుమారు 12 వరకు కార్పొరేట్ సంస్థలతో పాటు చిన్న, చితక అన్నీ కలిపి మరో 300 వరకు దుకాణాలు ఉన్నాయి. బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, చీపురుపల్లి తదితర ప్రాంతాల్లో ఇప్పటికే అమ్మకాలు పడిపోయాయి. గత ఏడాదితో పొలిస్తే అంత సందడి కనిపించడం లేదు. ఇళ్లలో ఉన్న బంగారాన్ని విక్రయించి వస్తువులు చేయించుకోడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. మరీ చిన్నదుకాణాలు వెలవెలబోతున్నాయి. గతంలో తక్కువ రేటులో బంగారం కొని ఉంచుకున్న వారు ఈ గరిష్ఠ ధరలో విక్రయించి, పెట్టుబడులు ఇతర మార్గాల్లోకి మళ్లిస్తున్నారు.
పెరిగిన బంగారం ధరలతో వ్యాపారం బాగా తగ్గిపోయింది. ఊహించని విధంగా ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేదు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో బంగారం దిగుబడి తగ్గడంతో పాటు మూడుసార్లు పెరగడం ఈ రేట్లు పెరుగుదలకు ప్రధాన కారణం. యుద్ధం ముగిసేంత వరకు రేట్లు ఇలానే ఉంటాయి. ఆ తర్వాత తగ్గే అవకాశాలున్నాయి. కొన్ని నెలల్లోనే 24 క్యారెట్ల బంగారం ఒక్కసారిగా రూ.లక్ష దాటడంతో వ్యాపారంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పెళ్లిళ్ల సీజన్లో మా అంచనాలు తల్లకిందులయ్యాయి. పెద్ద వస్తువులు కొనేవారు తగ్గిపోయారు. అవసరమైన చిన్న వస్తువులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
– మాధవ, గోల్డ్ మర్చంట్, విజయనగరం
రోజురోజుకు పెరుగుతున్న పసిడి ప్రస్తుతం తులం బంగారం ధర రూ.2 లక్షలకు చేరువైంది. 24 క్యారెట్ల బంగారం రూ.1,80,200, 22 క్యారెట్ల బంగారం ధర తుల రూ. 1,65800 పలుకుతోంది. అదే వెండి కిలో రూ.2,65,000 అమ్ముతుండటంతో కొనుగోలుదారులు బెంబేలెత్తి పోతున్నారు. గతంలో రూ.10 లక్షల వరకు పెళ్లికి ఖర్చవగా ఇందులో రూ.3 లక్షల వరకు బంగారానికే కేటా యించేవారు. ప్రస్తుతం ఇతర ఖర్చులు తగ్గించుకుని బంగారానికి ఎక్కువ మొత్తం కేటాయించాల్సి వస్తోందని వినియోగదారులు చెబుతున్నారు.


