ద్వారపురెడ్డి దారెటు? | - | Sakshi
Sakshi News home page

ద్వారపురెడ్డి దారెటు?

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

ద్వారపురెడ్డి దారెటు?

భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారా?

టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ జగదీష్‌ రాజకీయ భవితవ్యంపై చర్చ

మాజీ ఎమ్మెలేలు, చిరంజీవులు, భంజ్‌దేవ్‌లకు అవమానం

సాక్షి, పార్వతీపురం మన్యం: ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారశైలి ఉంటుందన్నది జగత్విదితమే. సుదీర్ఘ కాలంపాటు పార్టీకి సేవలందించిన నాయకులను..అవసరం తీరాక కరివేపాకు మాదిరి తీసి పడేయడం ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి జిల్లాలో పార్టీ అధ్యక్షుడిగా పని చేసిన..రాష్ట్ర అధికార ప్రతినిధిగా సేవలందించిన.. సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్‌ విషయంలోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు నుంచి ఆయనతోపాటు..మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును అధిష్టానం పూర్తిగా పక్కన పెట్టేసిన విషయం విదితమే. నియోజకవర్గంతో పాటు, జిల్లాలో బలమైన సామాజిక వర్గానికి చెంది న జగదీష్‌..నిన్న మొన్నటి వరకూ పార్టీ ఆదేశాలను దాటక, విధేయుడిగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఏ రోజుకై నా వాస్తవాలను గ్రహించి, పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని ఆశించారు. ఇటీవల జరిగిన పరిణామాలు ఆయనను మరింత కుంగదీశాయన్న ప్రచారం నడుస్తోంది. కొద్దిరోజుల క్రితం పార్వతీపురం మండలం అడ్డాపుశీల పంచాయతీ పిన్నింటిరామినాయుడువలసలో ఎన్టీఆర్‌ విగ్రహ ఆవిష్కరణ విషయంలో ఘర్షణ జరిగిన విషయం విదితమే. ఆ సందర్భంలో ఆయనతోపాటు, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులుకు తీవ్ర అవమానం జరిగింది. దీనిపై పార్టీ అధిష్టానం దృష్టి సారిస్తుందని భావించారు. నియోజకవర్గ ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర వైఖరిని ఆయన బహిరంగంగానే తప్పుబట్టారు. ఈ విషయాన్ని అధిష్టానం పట్టించుకోకపోగా..ఇటీవల నియామకం చేపట్టిన పార్టీ కమిటీల్లోనూ ఆయనకు చోటు కల్పించకపోవడం తీవ్రంగా బాధించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికార ప్రతినిధిగానూ ఆయనను తొలగించారు. చాలా రోజులుగా జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన మనస్తాపానికి గురైనట్లు సన్నిహిత వర్గాల భోగట్టా.

భంజ్‌దేవ్‌కూ పరాభవం

జగదీష్‌, చిరంజీవులు వంటివారే కాదు.. సాలూరుకు చెందిన సీనియర్‌ నేత భంజ్‌దేవ్‌కూ పార్టీలో తీరని పరాభావమే ఎదురవుతోంది. ఇటీవల ఓ విచారణ విషయమై పోలీసులు నేరుగా ఆయన ఇంటికి వెళ్లడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. సొంత పార్టీ నేతల ఒత్తిడితోనే పోలీసులు వచ్చారని సన్నిహితుల వద్ద వాపోయారు. సుదీర్ఘ కాలంపాటు రాష్ట్రసాయిలో సేవలందించిన ఆయనకు..పార్టీ కమిటీలోనూ చోటు కల్పించలేదు.

ఈ నేపథ్యంలో కష్టకాలంలోనూ తనతోపాటు నిలిచిన పార్టీ కార్యకర్తలతో నేడో, రేపో ఆయన సమావేశం కానున్నారని తెలుస్తోంది. వారితో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారని అంటున్నారు. అవమానాలు భరిస్తూ, పార్టీలో నే ఉండాలా? లేదా మరోచోటకు వెళ్లిపోవా లా? అన్నది కార్యకర్తల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement