● వాల్మీకి రామాయణం పరిశోధనా కేంద్రం డైరెక్టర్, ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్
విజయనగరం రూరల్: ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ వాల్మీకి రామాయణంపై చేసిన అవమానకరమైన, వాస్తవ విరుద్ధమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, రామనారాయణంలోని వాల్మీకి రామాయణం పరిశోధనా కేంద్రం డైరెక్టర్, ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాముడిని ఉత్తరం నుంచి దక్షిణానికి వలస వచ్చిన కూలీగా చిత్రీకరించడం ప్రకాష్‌రాజ్‌కు ఈ మహా ఇతిహాసం యొక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నాగరికత పరమైన గొప్పతనంపై సరైన అవగాహన లేమిని స్పష్టం చేస్తుందన్నారు. వాల్మీకి రామాయణం ఒక సాధారణ కావ్యం కాదని, ఇది భారతదేశ నైతిక విలువలకు, కుటుంబ వ్యవస్థకు, సమాజ నిర్మాణానికి పునాదని పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితం ద్వారా ధర్మం, న్యాయం, పాలనా విలువలు నేటికి మనకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు. భారతీయ కుటుంబ వ్యవస్థ, దాని నైతిక విలువలు, సంప్రదాయాలు, సంస్కృతి, సామాజిక ఐక్యత న్యాయం, సంక్షేమం ఆధారంగా ఉన్న ప్రజా విధానాలు భారత రాజ్యాంగంలోని మౌలిక హక్కుల ఆత్మ అని అన్నారు. ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు ప్రజల మధ్య విభేదాలను రగిలించే ప్రమాదం ఉందని, జాతీయ ఐక్యతను దెబ్బతీస్తాయని మండిపడ్డారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రముఖులు ఇలాంటి విషయాలలో మరింత బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. ఇలాంటి గొప్ప గ్రంథాలపై వ్యాఖ్యలు చేసే ముందు సరైన అధ్యయనం, అవగాహన అవసరమని, తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు భావోద్వేగాలను దెబ్బతీయడమే కాకుండా, సత్యాన్ని కూడా వక్రీకరిస్తాయని అన్నారు. తన వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని సరిదిద్దడానికి, రామాయణంలోని మహత్తర విలువలను ప్రతిబింబించే ఒక సార్థక కళాఖండం (సినిమా/నాటకం) రూపొందించడం ఉత్తమ మార్గమని మేము భావిస్తున్నామని పేర్కొన్నారు.


