వంగర: మండలంలోని మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టులో చేపలు వేట చేస్తూ జీవనం సాగిస్తున్న మత్స్యకారుల బతుకుల్లో అంధకారం అలుముకుంది. చేపల వేట నిషేధం అమలు చేయడంతో వారి కుటుంబాలు జీవనాధారం లేక రోడ్డున పడ్డాయి. కొట్టిశకు చెందిన శ్రీసీతారామ ఫిషర్‌మెన్ సొసైటీ సభ్యులు ఈ ప్రాజెక్టులో నిత్యం చేపలు వేట సాగిస్తున్నారు. ఈ సొసైటీలో ఉన్న సుమారు 500 మంది మత్స్యకారులకు ఈ ప్రాజెక్టే జీవనాధారం. గతంలో ప్రభుత్వానికి లీజు సొమ్ము చెల్లించకపోవడంతో మత్స్యశాఖ అధికారులు ప్రాజెక్టులో చేపల వేట నిషేధిస్తున్నట్లు వెల్లడించారు. గతంలో జరిగిన తప్పులకు తమను బాధ్యులను చేయవద్దని, తాజాగా మత్స్యకార సొసైటీ నూ తనం కార్యవర్గం ఎన్నికై న తరువాత చెల్లించాల్సిన లీజు మొత్తం చెల్లిస్తామని వారు చెబుతున్నారు. దీనికి అధికారులు ససేమిరా అనడంతో మత్స్యకార కుటుంబాల్లో చీకటి అలుముకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోయిన బీసీలు ఇదే ప్రాంతంలో మత్స్యకారులుగా మారి జీవనం సాగిస్తుండగా.. వందల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీలకు కూడా ప్రాజెక్టులో చేపల వేటే జీవనాధారం.
రూ.63 లక్షలు చెల్లించాల్సిందే
ప్రాజెక్టులో చేపల వేట నిషేధం అమలులో ఉంది. గడిచిన ఐదేళ్ల నుంచి మత్స్యకార సొసైటీ ద్వారా ప్రభుత్వానికి చెల్లించాల్సిన లీజు సొమ్ము సకాలంలో చెల్లించలేదు. 1431, 1432, 1433, 1434 ఫసలీలకు సంబంధించి గత ఏడాది జూలై నాటికి సుమారు రూ.45 లక్షలు చెల్లించాల్సి ఉంది. మత్స్యకార సొసైటీ కార్యవర్గం పదవీ కాలం ముగియడంతో ఆ పరిస్థితి మరింత జఠిలమైంది. అయితే గత ఏడాది నవంబర్ 11వ తేదీన నూతన కార్యవర్గం ఎన్నికై ంది. పాత బకాయిల చెల్లింపులో వెసులుబాటు ఇవ్వాలని, ప్రస్తుతం చెల్లించాల్సిన 1435 ఫసలీ డబ్బులు రూ.18,21,817 చెల్లిస్తామని సంఘం సభ్యులు అధికారుల ఎదుట వెల్లడించారు. దీనిపై గత ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన జేడీ లక్ష్మణరావు దర్యాప్తు చేపట్టి నివేదికను ప్రభుత్వానికి, మత్స్యశాఖ కమిషనర్ ద్వారా అందించారు. అప్పటి నుంచి ఆ దర్యాప్తు నివేదిక ఏమైందో తెలియని పరిస్థితి, ఏమి చర్యలు తీసుకున్నారో తెలియని దుస్థితి నెలకొంది. తాజాగా నూతన కార్యవర్గం ఎన్నిక జరిగినప్పటికీ ప్రాజెక్టులో చేపల వేట చేసేందుకు ఇటీవల ఓపెన్ ఆక్షన్ పెడతామని అధికారులు ముందస్తు ప్రకటన జారీ చేశారు. దీంతో మత్స్యకారులంతా ప్రతిఘటించడంతో అధికారులు వెనక్కి తగ్గారు. 1435 ఫసలీ సొమ్ము చెల్లించి మత్స్యకారులంతా చేపల వేటకు సిద్ధమని అధికారులకు తెలియజేసినప్పటికీ గత పాత నాలుగు ఫసలీల సొమ్ము రూ.45 లక్షలు, ప్రస్తుతం కొత్త ఫసలీ సొమ్ము మొత్తం రూ.18.21 లక్షలు కలిపి మొత్తం రూ.63 లక్షలు చెల్లించాల్సిందేనని మత్స్యశాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. దీంతో మత్స్యకారుల్లో గందరగోళంలో నెలకొంది. చేపల వేట నిషేధిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని, నిషేధాన్ని ఎత్తివేయకపోతే ఉద్యమబాట పట్టే యోచనలో మత్స్యకారులున్నట్లు తెలుస్తోంది.
మత్స్యకారుల బతుకుల్లో అంధకారం
మడ్డువలసలో చేపల వేట నిషేధం
పాత బకాయిల పేరుతో లీజు ఆర్డర్ నిలుపుదల
సమస్య పరిష్కరించాలంటూ 500
మంది మత్స్యకారుల డిమాండ్
చేపల వేట నిషేధిస్తే ఎలా?
ప్రాజెక్టులో చేపలు వేట చేసి జీవనం సాగించే తమకు వేట నిషేధం చేస్తే జీవనం కష్టతరమవుతుంది. 500 మత్స్యకార కుటుంబాలు రోడ్డున పడతాయి. గత నాలుగు ఫసలీల లీజు సొమ్ము చెల్లించనంత వరకు అధికారులు నిద్రావస్థలో ఉండడమే ప్రధాన సమస్య అయింది. పాత బకాయిలు కలిపి తమను కట్టమంటే ఎలా కట్టగలం.
మల్లీడ తవిటందొర, మత్స్యకారుడు, సంగాం
అన్ని ఫసలీల సొమ్ము చెల్లించాలి
గతంలో బకాయి పడిన మొత్తం సొమ్ముతో పాటు ప్రస్తుతం 1435వ ఫసలీ సొమ్ము చెల్లించాలి. చేపల వేట నిషేధం వాస్తవమే. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు అమలు చేస్తున్నాం. మత్స్యకారుల పట్ల మాకు ఏమీ కక్ష లేదు. మత్స్యకారులు సమస్యపై ఫిర్యాదు చేస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తాం.
సీహెచ్.వి.వి.ప్రసాదరావు, అసిస్టెంట్ ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్, రాజాం.
మత్స్యశాఖ అధికారుల కక్ష
మత్స్యకారులపై అధికారులు కక్ష గడుతున్నారు. ప్రస్తుత కాలానికి లీజు సొమ్మును చెల్లించేందుకు మా సంఘం సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చాం. గతంలో ఉన్న బకాయిలు ఇప్పుడు చెల్లించమంటే ఎలా చెల్లించగలం. ఉన్నతాధికారులు పునరాలోచించి చేపల వేట నిషేధం ఎత్తివేయాలి. 1435 ఫసలీ సొమ్ము చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. అధికారులు లీజు ఆర్డర్ ఇవ్వాలి.
కోల రాము, మత్స్యకారుడు, మగ్గూరు.


