గిరిజనులకు రేషన్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

గిరిజనులకు రేషన్‌ కష్టాలు

Apr 20 2026 9:23 AM | Updated on Apr 20 2026 9:23 AM

గిరిజనులకు రేషన్‌ కష్టాలు

సింధునగరం, పెద్దూరు గ్రామస్తులకు తప్పని పాట్లు

స్టాక్‌ పాయింట్లు ఏర్పాటు

చేయాలంటున్న గిరిజనులు

వీరఘట్టం: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రేషన్‌ కార్డు దారులకు గడప వద్దకే రేషన్‌ బండి వచ్చి రేషన్‌ బియ్యాన్ని అందించేది. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో రేషన్‌ బియ్యం కోసం గడపదాటి కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తోందని గిరిజనులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని దశుమంతపురం పంచాయతీ పరిధి పెద్దూరు, సింధునగరంలలో ప్రజలు తమ రేషన్‌ సరుకుల కోసం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న దశుమంతపురం గ్రామానికి వెళ్లి ప్రతి నెలా తెచ్చుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. రేషన్‌ సరుకుల కోసం ఈ రెండు గ్రామాల గిరిజనులు ప్రతి నెలా నానా ఇబ్బందులు పడుతున్నా వారి గోడు వినే నాథుడు కరువయ్యాడని వాపోతున్నారు.

ఇదీ పరిస్థితి

మండలంలోని దశుమంతపురం గ్రామపంచాయతీలో పెద్దూరు, సింధునగరం హేమ్లెట్‌ గ్రామాలుగా ఉన్నాయి. పెద్దూరులో 48 మంది కార్డుదారులు, సింధునగరంలో 24 మంది కార్డుదారులు ఉన్నారు. వారికి ప్రతినెలా 1985 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఈ బియ్యం దశుమంతపురంలో ఉన్న రేషన్‌ షాపు వద్దకు వెళ్లి తీసుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. గ్రామం నుంచి పంట పొలాల్లో, నాగావళి ఎడమకాలువను దాటుకుని నడిచి వెళ్తే 5 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి.ఇంకొకటి వీరఘట్టం,చలివేంద్రి గుండా రోడ్డు మార్గంలో వెళ్తే 15 కిలో మీటర్లు ప్రయాణం చేయాలి. ఇలా ఈ రెండు మార్గాల గుండా బియ్యం తెచ్చుకునేందుకు ఈ రెండు గ్రామాల గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. తమ ఇబ్బందులు గుర్తించి గ్రామంలో స్టాక్‌ పాయింట్‌ పెట్టి బియ్యం పంపిణీ చేయాలని ఈ రెండు గ్రామాల గిరిజనులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement