గంట్యాడ: కుటుంబానికి తోడుగా నిలవాలని ఆశించిన ఓ పేదింటి యువతి ప్రాణం రోడ్డు ప్రమాదంలో కరిగిపోవడం గంట్యాడ మండలాన్ని కలిచివేసింది. గంట్యాడ మండలంలోని పెదవేమలి గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో నరవ గ్రామానికి చెందిన బోనెల రేణుక(18) మృతి చెందింది. ఈ ప్రమాదంపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరంలో ఓ బట్టల షాపులో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న రేణుక..నిర్వాహకుల సూచనల మేరకు ముకపాక, సిరిపురం, పెదవేమలి గ్రామాల్లో ప్రచారం కోసం సహచరులతో కలిసి ఆటోలో బయలుదేరింది. ప్రచారం ముగించుకుని తిరుగు ప్రయాణంలో పెదవేమలి సమీపంలో ఆటోలో నుంచి అనుకోకుండా జారిపడింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. ఆమె పరిస్థితిని గమనించిన సహచరులు వెంటనే అదే ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే రేణుక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని గంట్యాడ ఎస్సై డి.సాయికృష్ణ తెలిపారు.
కుటుంబానికి ఆదరణ అవసరం
పేద కుటుంబానికి చెందిన రేణుక, చిన్న వయస్సులోనే కుటుంబ భారం తగ్గించాలని ఉద్యోగం చేస్తూ కుటుంబానికి ఆధారంగా నిలబడాలని కృషి చేసింది. అలాంటి సమయంలోనే జరిగిన ఈ దుర్ఘటన గ్రామాన్ని విషాదంలో ముంచెత్తింది. గ్రామస్థులు, స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటూ బాధిత కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం, పరిహారం అందించాలని కోరుతున్నారు.
గుండెపోటుతో పీహెచ్‌సీ
ఉద్యోగిని..
జియ్యమ్మవలస రూరల్: జియ్యమ్మ వలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీహెచ్‌ఓగా పనిచేస్తున్న బిడ్డిక హైమావతి శుక్రవారం రాత్రి తన స్వగ్రామం గుమ్మలక్ష్మీపురంలో గుండెపోటుతో మరణించారు. ఆమె రెండేళ్ల క్రితం పశ్చిమగోదావరి జిల్లా నుంచి బదిలీపై జియ్యమ్మవలస పీహెచ్‌సీకి వచ్చారని, మరో 40 రోజుల్లో ఉద్యోగ విరమణ చేయనున్నారని ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది తెలిపారు. తోటి ఉద్యోగులతో సన్నిహితంగా ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకునేవారని తన కుమారుడి వివాహం చేసే పనిలో రెండు రోజులుగా సెలవులపై వెళ్లారని, ఇంతలో ఆమె మృతి చెందడంపై సహచర సిబ్బంది, వైద్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమెకు ఆత్మశాంతి కలగాలని వారంతా కోరారు.


