విజయనగరం టౌన్: వైశాఖ శుద్ధ దశమి ఆదివారం వాసవీ కన్యకాపరమేశ్వరి జయంతి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవాలయం పాలకమండలి అధ్యక్షుడు నారాయణం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు కార్యాలయం ఆవరణలో దేవాలయ గౌరవాధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఉత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం నారాయణం శ్రీనివాస్ మాట్లాడుతూ జయంతి ఉత్సవాలను రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టామన్నారు. 25న 108 మంది దంపతులతో అష్టోత్తర శత కలశ ప్రదక్షిణ, 26న అమ్మవారికి ప్రత్యేకాభిషేకాలు, బంగారు చీర, వజ్రకీరీటంతో విశేష అలంకరణ ఉంటుందన్నారు. 108 రకాల పిండివంటలతో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి సారె సమర్పణ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటం, కర్రసాము, పులివేషాలతో అమ్మవారి ఊరేగింపు పండగ నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు ఉసిరికల చంద్రశేఖర్, కాపుగంటి ప్రకాష్, కుమ్మరిగుంట శ్రీనివాస్, రవ్వా శ్రీనివాస్, వెత్సా సత్యనారాయణమూర్తి, మామిడిపాక జగన్, విజ్జపు వెంకట శ్రీనివాసరావు, బలభద్రుని నానాజీ, మురుగన్, బుడ్డెపు వెంకటరావు, పెంటపాటి కామరాజు, వెత్సా శ్రీనివాస్, గోపాలకృష్ణ, బాల తదితరులు పాల్గొన్నారు.


