బాడంగి: మండలంలోని గజరాయునివలస గ్రామానికి చెందిన కందుల సత్యనారాయణ(58) శుక్రవారం రాత్రి ఆటో ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందినట్టు బాడంగి పోలీసులు శనివారం తెలిపారు. సత్యనారాయణ శుక్రవారం రాత్రి గ్రామంలో రోడ్డుపై నడుస్తుండగా రామభద్రపురం నుంచి బాడంగి వైపు వస్తున్న ఆటో డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ వెనుక నుంచి వచ్చి ఢీకొన్నాడు. దీంతో సత్యనారాయణ తలకు తీవ్ర గాయమైంది. భుజానికి, కాలికి కూడా గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడు కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు. బాడంగి సీహెచ్‌సీకి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయినట్టు తెలిపారు. మృతుడి సోదరుడు తాతయ్యలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెర్లాం ఎస్‌ఐ సాగర్‌బాబు కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ ప్రసాద్ చెప్పారు. సత్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
గజపతినగరం : మండలంలోని పురిటిపెంట ఎస్సీ కాలనీకి చెందిన నీలంశెట్టి రమణ(48) చంపావతి నదిలో పడి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. రమణ కొన్నేళ్ల కిందట వివాహమైంది. తరువాత భార్యకు దూరమై ఓ ప్రైవేటు దుకాణంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మద్యం సేవించి అటుగా వెళ్తున్న సమయంలో నదిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్టు స్థానికులు చెబుతున్నారు.
సంతకవిటి: మండలంలోని రామారాయపురం గ్రామానికి చెందిన యెన్ని ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో శనివారం మృతి చెందాడు. బంధువులు తెలిపిన వివరాలు.. ఉమామహేశ్వరరావు హైదరాబాద్‌లో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవిస్తున్నారు. ఆయన శనివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా చెట్టు కొమ్మ పడి గుండెకు బలంగా తాకడంతో మృతి చెందాడు. ఆయనకు భార్య గౌరి, కొడుకు కార్తికేయ, కూతురు జ్ఞాన మనస్వి ఉన్నారు. భార్య పిల్లలు శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలంలోని తాడివలసలో అమ్మవారి పండగ నిమిత్తం అత్త వారింటికి వారం కిందట చేరుకున్నారు. ఉమామహేశ్వరరావు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.


