రాజాం సిటీ: మద్యం మత్తులో ఓ యువకుడు మరో యుకుడిపై చాకుతో విచక్షణా రహితంగా గాయపర్చిన ఘటన రాజాం పట్టణంలోని శ్రీనివాసకాలనీలో శుక్రవారం రాత్రి కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనివాస కాలనీలో నివసిస్తున్న కురిటి కిరణ్ టిఫిన్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే కాలనీలో నివసిస్తున్న నల్ల మురళి ప్రతిరోజు మాదిరిగా శుక్రవారం రాత్రి మద్యం సేవించి గొడవపడుతుండగా కిరణ్ అక్క కురిటి పద్మ వచ్చి ఇక్కడ గొడవ పడవద్దని చెప్పింది. ఆమెతో మురళీ గొడవకు దిగి గాయపర్చాడు. దీనిపై ప్రశ్నించిన పద్మ తండ్రి సత్యనారాయణను కూడా తోసేశాడు. వెంటనే అక్కడున్న కిరణ్ కలుగజేసుకుని అక్క, తండ్రిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అయినా, మురళి వారిని వెంటాడాడు. ఇంటికి వెళ్లి వెంట తెచ్చుకున్న చాకుతో కిరణ్‌పై దాడికి పాల్పడ్డాడు. వీపు, మెడ, ఎడమ చెవి, ఎడమ చేయిపై విచక్షణా రహితంగా గాయపర్చాడు. స్థానికులు గాయపడిన కిరణ్‌ను రాజాం సీహెచ్‌సీలో చేర్పించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ పి.ఉమావెంకటేశ్వరరావు తెలిపారు. ఇటీవల కాలంలో రాజాంలో మద్యం, గంజాయి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయని, వీటిని సేవించిన యువత విచక్షణ కోల్పోయి దాడికి తెగబడుతున్నారన్న చర్చ సాగుతోంది. మద్యం మత్తులోనే మైనర్ అయిన మురళీ దాడిచేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.


