● సీనియర్లను తొక్కేసిన టీడీపీ
అధిష్టానం
● పత్తాలేని కొండపల్లి, చిరంజీవులు, పతివాడ
● జాడలేని యువజనం
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
అవసరానికి వాడుకోవడం.. మోసం చేయడం.. వదిలేయడం టీడీపీ నేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నది రాజకీయ విశ్లేషకులు తరచూ చెప్పేమాట. వారు ఓటర్లా.. ప్రజలా.. నాయకులా.. అన్నది కాదు. ఆయన దృష్టిలో ఎవరైనా ఒక్కటే. అవసరం, వారి నుంచి స్వప్రయోజనం లేదని తెలిస్తే ఎంతటివారైనా కరివేపాకుతో సమానం. ఈ విషయం ఇప్పుడిప్పుడే టీడీపీ నేతలకు బోధపడుతున్నట్టు ఉంది. ఇన్నాళ్లూ పార్టీలో మాదే పెత్తనం.. మాదే పెద్దరికం అనుకుంటూ వస్తున్న పలు కుటుంబాలు మొన్నటి టీడీపీ రాష్ట్ర కమిటీలో పత్తా లేకుండా పోయాయి. నిన్నమొన్నటివరకు పార్టీలో మాదే రాజ్యం.. నాయకులమైనా, సేవకులమైనా అంతా మేమే అనుకున్న వాళ్లంతా ఆ కమిటీలో గల్లంతైపోయారు. జిల్లాలో ఒకనాడు చక్రం తిప్పినవాళ్లు నేడు కనుమరుగయ్యారు. దీనిపై ఎవరినీ అడిగే పరిస్థితి లేదు. సమాధానం చెప్పే వారూ లేకపోవడంతో అందరూ ఎవరికివారే సమాధానం చెప్పుకుని లోలోపల కుమిలిపోవడం తప్ప మరో మార్గం లేకపోయింది.
2014–19 మధ్య గజపతినగరం ఎమ్మెల్యేగా పనిచేసిన కొండపల్లి అప్పలనాయుడు ఆ తర్వాత 2024 వరకు నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్నారు. చివరి వరకు టికెట్ ఆశించి చివరకు అన్న కొడుకు శ్రీనివాస్ టికెట్ ఎగరేసుకుపోవడంతో అసంతప్తితో రగిలిపోయారు. ఆయనకు ఎన్నికల వరకు ఎన్నికల సమన్వయకర్తగా బుజ్జగిస్తూ పార్టీ అధిష్టానం వచ్చింది. ఎన్నికల్లో కొండపల్లి శ్రీనివాస్ గెలవడం, మంత్రి అయిపోవడం జరగగానే అప్పలనాయుడును పార్టీ పూర్తిగా పక్కన పెట్టేసింది. నిన్నటి రాష్ట్ర కార్యవర్గంలో ఆయనతోపాటు ఆయన అనుచరులు ఎవరూ చోటు దక్కించుకోలేకపోయారు. అధిష్టానంతో అనుబంధం ఉండే రాష్ట్రస్థాయి పదవి దక్కితే భవిష్యత్తులో తన ఉనికికే ముప్పు వస్తుందని భావించి ఏ పదవీ లేకుండా మంత్రి చక్రంతిప్పారంటూ అప్పలనాయుడు అనుచరవర్గం లోలోన రగిలిపోతుంది.
పతివాడ ఫ్యామిలీకి పదవి లేదాయె..
పతివాడ నారాయణ స్వామి నాయుడు ఆరేడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం తరఫున మంత్రిగా కూడా పనిచేసి పార్టీలో కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడు తమ్మి నాయుడు మొన్నటి వరకు రాష్ట్ర కార్యదర్శిగా ఉండేవారు. నేటి కొత్త కమిటీలో వారికి స్థానం లేకుండా పోయింది. దీంతో ఇక పతివాడ కుటుంబానికి తెలుగుదేశం రాజకీయ తెర దించేసిందన్నది ఆ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నమాట.
నాయుడు కరుసైనట్లే...


